తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. తమపై చేసిన కామెంట్లకు క్లారిటీ ఇవ్వడమే కాకుండా తెలంగాణలోని అధికార పార్టీపై సైతం విరుచుకుపడ్డారు.
బీజేపీతో తమకు పొత్తు ఉందని కేటీఆర్ మాట్లాడుతున్నారని అయితే బీజేపీతో డ్యూయెట్లు పాడింది టీఆర్ఎస్ పార్టీ కాదా? అని షర్మిల ప్రశ్నించారు. సింహం సింగిల్ గానే వస్తుందని షర్మిల వ్యాఖ్యానించారు. తమకు ఎవరితో పొత్తులు లేవని వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు.
“అయ్యా కేటీఆర్ గారు బీజేపీతో పొత్తులు ఉన్నది ఎవరికి? మీరు తెరవెనుక పొత్తు పెట్టుకొని మమ్మల్ని అంటారా? మేం ఎవరికి ఏజెంట్లు కాదు. ఇక్కడ ఉన్నది వైఎస్సార్ బిడ్డ..వైఎస్సార్ రక్తం. సింహం సింగిల్ గానే వస్తుంది. మాకు బీజేపీ తో అవసరం లేదు…కాంగ్రెస్ తో అవసరం లేదు ..టీఆరెఎస్ తో అంతకన్నా అవసరం లేదు. మాకు వైఎస్సార్ బొమ్మ ఉంది..వైఎస్సార్ పేరుంది. వైఎస్సార్ అనే మూడు అక్షరాలు చాలు. అవును నిజమే..మేము ఓట్లను చీలుస్తాం!టీఆరెఎస్ ఓట్లను చీలుస్థాం…బీజేపీ,కాంగ్రెస్ ఓట్ల ను సైతం చీలుస్తాం“ అంటూ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.
అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తున్నారని కేటీఆర్ అనడంలో వాస్తవం లేదని షర్మిల పేర్కొన్నారు. “అన్న మీద కోపం ఉంటే ఇక్కడ పార్టీ పెట్టడం ఏంటి అని కేటీఆర్ అంటున్నాడు. నాకు మా ఆన్న మీద కోపం ఉంటే ఇక్కడ పార్టీ పెట్టి లాభం లేదు అనే ఇంగిత జ్ఞానం ఉంది. కేటీఆర్ మాటల్లో నిజం లేదు కాబట్టే…అక్కడ పార్టీ పెట్టలేదు… ఇక్కడ పార్టీ పెట్టాం!
ఇక్కడ పార్టీ పెట్టడానికి కారణం ఎవరో తెలుసా..కేసీఆర్ దిక్కుమాలిన పాలన వాళ్ళే వైఎస్సార్ తెలంగాణ పార్టీ. ఉద్యమంలో కేసీఆర్ లాఠీ దెబ్బలు తిన్నారా? వందల మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే సాధ్యం అయ్యింది తెలంగాణ. దీక్షలు చేసి గడ్డం పెంచుకున్నట్లు నాటకం ఆడారు. తెలంగాణ ఉద్యమం లో ఏమి చేయని వారు మంత్రులు అయ్యారు.
తెలంగాణ కు మీకంటే మేమే చేశాం. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే భరోసా కల్పించింది మేము. నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగ దీక్షలు చేసింది మేము. కరోనా సమయం లో మహిళలను ఆర్థికంగా ఆదుకొని నిలబడింది మేము. మీరు ఏం చేశారు…ఎంతటి మొనగాల్లో చెప్పండి“ అంటూ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.