భారత్ లో ప్రజలు తమ లోకల్ లాంగ్వేజ్ లో కాకుండా మిగతా సందర్భాల్లో మాట్లాడేటపుడు హిందీ మాట్లాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇంగ్లిషుకు బదులుగా హిందీ మాట్లాడాలన్న షా కామెంట్లు కాక రేపాయి. షా చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ మంత్రి కేటీఆర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మండిపడ్డారు.
తమిళభాష అద్భుతమైనదంటూ పరోక్షంగా రెహమాన్ కౌంటర్ వేయడం చర్చనీయాంశమైంది. తాము హిందీ ఎక్కడ మాట్లాడాలో, హిందీ ఎక్కడ నేర్చుకోవాలని షా కోరుకుంటున్నారో తెలుసుకోవాలనుందని ప్రకాష్ రాజ్ కూడా చురకలంటించారు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయొద్దు… మా భిన్నత్వాన్ని మేం ప్రేమిస్తాం, మా మాతృభాషను మేం ప్రేమిస్తాం… అంటూ కుండబద్దలు కొట్టారు ప్రకాష్ రాజ్.
ఇది ‘దేశ భిన్నత్వంపై దాడి’ అని, భారతదేశం ఓ వసుదైక కుటుంబమని కేటీఆర్ కూడా మండిపడ్డారు. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశంలోని ప్రజలు ఏం తినాలో, ఏం ధరించాలో, ఎవరిని ప్రార్థించాలో, ఏ భాషా మాట్లాడాలో ప్రజల నిర్ణయాలకే వదిలేయాలని కేటీఆర్ చురకలంటించారు. ఈ నేపథ్యంలోనే హిందీ భాషపై, బాలీవుడ్ సినిమాలపై ప్రముఖ కన్న నటుడు కిచ్చ సుదీప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హిందీ ఇకపై ఏమాత్రం జాతీయ భాష కాదని, బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తోందని చెప్పాడు. సినిమాలను తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు బాలీవుడ్ ప్రముఖులు ఎంతో కష్టపడుతున్నారని షాకింగ్ కామెంట్లు చేశాడు. అయితే, ఆ బాలీవుడ్ సినిమాలు అంతగా విజయం సాధించలేకపోతున్నాయని, మనం తీస్తున్న సినిమాలను మాత్రం ప్రపంచం మొత్తం చూస్తున్నారని సుదీప్ చెప్పుకొచ్చాడు. కేజీఎఫ్-2 సక్సెస్ సందర్భంగా సుదీప్ చేసిన కామెంట్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.