ఏపీలో అప్పులు…వాటి కోసం జగన్ పడుతున్న తిప్పలు…కొద్ది నెలలుగా ఏపీతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఏపీలో జనంపై జగన్ అప్పుల భారం మోపుతున్నారని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ అప్పుల తిప్పలపై టీడీపీ అధినేత చంద్రబాబు గతంలోనే ఏపీ ప్రజలకు షాకింగ్ అప్ డేట్లు ఇచ్చారు. ఏపీలో ప్రతీ కుటుంబంపై రూ.5లక్షల అప్పు భారాన్ని జగన్ మోపారని చంద్రబాబు లెక్కలతో సహా ప్రూవ్ చేశారు.
జగన్ చేసే అప్పులు ఎవరూ కట్టరని.. రేపు ప్రజలే కట్టాలని, ప్రభుత్వ ఆస్తులన్నీ జగన్ తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని జగన్ సర్కార్ అప్పుల ఊబిలోకి నెట్టేసిందని విమర్శించారు. రాష్ట్ర జనాభా 5 కోట్లు…రెండున్నరేళ్లలో జగన్రెడ్డి రూ.7లక్షల కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ అప్పులపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో ఏపీ రూ.7.76 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందని యనమల ఆరోపించారు.
జగన్ మరోసారి బహిరంగ మార్కెట్, కార్పొరేషన్ల రుణాలను తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయాలని యనమల కోరారు. మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జగన్కు అర్థమైందని, అందుకే ఏపీని మరింత అప్పుల ఊబిలోకి నెట్టాలని జగన్ చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి ఆలోచించకుండా తన పార్టీ గురించే జగన్ ఆలోచిస్తున్నారని యనమల దుయ్యబట్టారు.
అవినీతి సొమ్ముతో వచ్చే ఎన్నికలలో అక్రమాలకు పాల్పడాలని చూస్తున్నారని జగన్ పై విమర్శలు గుప్పించారు. ఏపీలో ఆదాయం లేక ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని, ఏపీని దుష్ట చతుష్టయం పట్టి పీడీస్తోందని నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రజలను వైసీపీ నేతలు సమస్యల్లో నెట్టేస్తున్నారని, ప్రశ్నిస్తోన్న ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.