పోలవరం….రాష్ట్రానికి జీవనాడి వంటి జాతీయ ప్రాజెక్టు. అయితే, పోలవరం వైఎస్ కల అని..తండ్రి మొదలుబెట్టిన ఈ మెగా ప్రాజెక్టును తనయుడు జగన్ పూర్తి చేస్తాడని, ఇది దేవుడి స్క్రిప్ట్ అని వైసీపీ నేతలు గొప్పలు చెబుతుంటారు. చంద్రబాబు హయాంలో పోలవరం పనులు 60 శాతానికి పైగా పూర్తయినా సరే…ఆ క్రెడిట్ ను కూడా వైఎస్ఆర్, జగన్ ల ఖాతాలో వేసి ఆనందిస్తుంటారు వైసీపీ నేతలు. కానీ, ప్రతిపక్ష నేతగా పోలవరాన్ని చిన్నచూపు చూసిన జగన్..సీఎం అయిన తర్వాత కూడా ఆ ప్రాజెక్టును పట్టించుకోలేదన్నది వాస్తవం.
పోలవరం పనులకు చేసిన దాదాపు వెయ్యి కోట్ల రూపాయల బిల్లులను రీయింబర్స్ చేయాలన్న జగన్ సర్కార్ రిక్వెస్ట్ కు కేంద్ర జలశక్తి శాఖ గతంలో నో చెప్పడం వంటి ఘటనలు ఇందుకు నిదర్శనం. జగన్ వైఖరితో పోలవరానికి కేంద్రం నుంచి నిధులు రాకపోగా…రాష్ట్రం చేసిన ఖర్చు కూడా రీయింబర్స్ కాకపోవడంతో ఏపీ ఆర్థిక శాఖపై వెయ్యి కోట్ల భారం పడినట్లయింది. ఆ వెయ్యి కోట్లలో రూ.805.68 కోట్లు.. తుది అంచనా వ్యయం రూ.20,398 కోట్లకు మించి ఉన్నాయని కేంద్రం భావించగా…మిగిలిన రూ.280.69 కోట్ల విలువైన పనులు.. డీపీఆర్‌లో లేవంటూ చేతులు దులుపుకుంది.
ఇలా జగన్ చేతగానితనం వల్ల పోలవరం పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అందుకే, పోలవరం దగ్గర 144 సెక్షన్ పెట్టి తమ తప్పులను జగన్ సర్కార్ కప్పిపుచ్చుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. సీఎం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వ నాశనం అయిందని, ఏపీలో ప్రాజెక్టుల పనులపై నీలినీడలు కమ్ముకున్నాయని గోరంట్ల విరుచుకుపడ్డారు.
పోలవరం పనులు ఎందుకు జరగడం లేదని, పోలవరం సహా ఏపీలోని ప్రాజెక్టుల వద్ద 144 సెక్షన్ ఎందుకు అమలు చేస్తున్నారని గోరంట్ల నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నిధులు ఎందుకు సాధించలేకపోతున్నారని గోరంట్ల ప్రశ్నించారు. ఏపీలో గత పథకాలకే పేర్లు మార్చి సంక్షేమానికి ఖర్చు చేస్తున్నారని, ప్రాజెక్టుల మీద వైసీపీ మంత్రులకు ఏ మాత్రం అవగాహన లేదని ఆయన చెప్పారు.
రాష్ట్రంలోని పరిస్థితుల గురించి జగన్ కనీస ఆలోచన చేయడం లేదని విమర్శించారు.
కేవలం ఓట్ల కోసం మాత్రమే జగన్ ఆలోచిస్తున్నారని ,ఇంతటి అవినీతి, అసమర్థ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరని ప్రజలు అనుకుంటున్నారని ఆయన చెప్పారు.