సింగర్ సునీత గురించి తెలుగు ప్రేక్షకులకు, సంగీత అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. నేపథ్య గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, మ్యూజికల్ షోలకు జడ్జిగా సునీత రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల, మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ ను పెళ్లి చేసుకున్న సునీత తన జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే సునీత రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆమెపై రకరకాల పుకార్లు వస్తున్నాయి.
తన భర్తతో కలిసి ఓ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారని పుకార్లు రాగా…సునీత ఖండించారు. తన భర్త రామ్ తో కలిసి వెబ్ సిరీస్ నిర్మాణ రంగంలోకి సునీత అడుగుపెట్టబోతున్నారని గతంలో మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరగగా…అదేమీ లేదని ఆమె కొట్టిపారేశారు. రామ్ నిర్మించబోయే వెబ్ సిరీస్ లో సునీత నటిస్తున్నారంటూ కూడా నెటిజన్లు రకరకాల కామెంట్లు చేయడాన్ని సునీత గతంలో ఖండించారు. ఆ తర్వాత రామ్, సునీతల జంటపై కూడా కొందరు నెటిజన్లు తమ నోటికొచ్చినట్లు మాట్లాడారు.
డబ్బుకోసమే రామ్ ను సునీత పెళ్లి చేసుకున్నారని నెటిజన్లు కామెంట్లు చేయడంతో….వారికి సునీత ఘాటుగా జవాబిచ్చారు. అయినా సరే సునీత పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం మాత్రం నెటిజన్లు ఆపలేదు. తాజాగా సునీత ఓ మామిడి చెట్టు దగ్గర దిగిన ఫొటోపై నెటిజన్లు రకరకాల ప్రచారాలు మొదలుబెట్టారు. సునీత తల్లికాబోతోందా? అందుకే మామిడిచెట్టు వద్ద తీయించుకున్న ఫొటో షేర్ చేసిందా? అంటూ కథనాలు వండివార్చడం మొదలెట్టారు. దీంతో, ఆ ఫొటోపై సునీత స్పందించారు.
“మీకో దండంరా నాయనా… జనాలు ఇంత క్రేజీగా ఉంటారా… మామిడి చెట్టుకు తొలిసారి కాయలు కాయడంతో వాటితో ఫొటో దిగాను. దాన్ని ఈ విధంగా ప్రచారం చేస్తారా? ఊహాజనిత కథనాలు, రూమర్లను వ్యాప్తి చేయడం ఇకనైనా ఆపండి” అంటూ సునీత ఆ మామిడిపళ్ల ఫొటోపై క్లారిటీ ఇచ్చారు.