ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు జనపేన అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వంపై పవన్ విమర్శలు గుప్పించారు. కౌలు రైతు భరోసా యాత్ర సందర్భంగా పవన్ చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యాఖ్యలపై ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తీవ్రంగా స్పందించారు.
పవన్ కల్యాణ్ పై మంత్రి అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బహుభార్యలున్న పవన్ కల్యాణ్ విలువలు లేని వ్యక్తి అని ఆయన రెండో భార్య రేణు దేశాయ్ చెప్పారని అమర్ నాథ్ షాకింగ్ కామెంట్లు చేశారు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ భార్యలు ఉన్న వ్యక్తి పవన్ అని, అలాంటి వ్యక్తి సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నాడని వివాదాస్పద కామెంట్లు చేశారు. రుణమాఫీపై రైతులను మోసం చేసిన గత ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించలేదని ఆరోపించారు.
జగన్ సర్కారుపై పవన్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని,. రాష్ట్రంలో కౌలు రైతుల కష్టాలకు కారణం గత ప్రభుత్వమేనని దత్తపుత్రుడు తెలుసుకోవాలంటూ అమర్ నాథ్ షాకింగ్ కామెంట్లు చేశారు. జగన్ ప్రభుత్వాన్ని పవన్ అనవసరంగా నిందిస్తున్నారని, ప్రతి కౌలు రైతుకు సీఎం జగన్ పరిహారం అందిస్తున్నారని స్పష్టం చేశారు. మంత్రి అమర్ నాథ్ వ్యాఖ్యలపై పవన్ స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.