ప్రజలు మునుపటిలాగా లేరు. క్షణాల్లో స్పందిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా.. నిమిషాల్లో ప్రజలకు చేరి పోతోంది. అదే సమయంలో ప్రశ్నించేతత్వం కూడా పెరిగింది. దీంతో మునుపటి మాదిరిగా, ప్రజలు అణిగి మణిగి ఉండే రోజులు పోయాయి. అయితే.. జనం ఇంతగా మారినా.. నాయకులు మాత్రం మారడం లేద నే టాక్ వినిపిస్తోంది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి విషయంలో ఇది నిజమని అంటున్నా రు పరిశీలకులు. ఈయనపై చీరాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. `మాకెందుకొచ్చిన నాయకుడు!` అని ఇక్కడి ప్రజలు తలలు బాదుకుంటున్నారు.
దీనికి కారణమేంటంటే.. కరణం సార్.. కుదురుగా ఒకదగ్గర ఉండకపోవడమే! వాస్తవానికి కరణం సొంత నియోజకవర్గం అద్దంకి. అయితే.. గత ఎన్నికల్లో ఆయన చీరాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక, కరణానికి ఇష్టమైన నియోజకవర్గం .. ఒంగోలు. అంటే.. అసలు నియోజకవర్గం అద్దంకి, గెలిచింది చీరాల… ఇష్టపడేది మాత్రం ఒంగోలు. దీంతో ఆయన వారానికి ఒక్కసారి కూడా ఒంగోలును విడిచి పెట్టడం లేదు. సొంత నియోజకవర్గానికి వెళ్లినా.. వెళ్లకపోయినా.. ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ, తాను పోటీచేసి గెలిచి.. ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన చీరాలను కూడా కరణం పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
కనీసం వారానికి ఒకసారి కూడా చీరాలలో కరణం ఉండడంలేదని, ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం ఉంటే.. వచ్చిపోవడం తప్ప.. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని .. కొన్నాళ్లుగా విమర్శలు వస్తున్నాయి. కరోనా సమయంలో మొత్తం ఒంగోలును విడిచి కాలు బయట పెట్టకపోయినా…. సరే అని! అప్పట్లో సరిపెట్టుకున్నారు ప్రజలు. కానీ, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనూ ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉండడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే.. కరణం మాత్రం ప్రజలు ఒంగోలుకు వస్తే…తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో కరణంపై ఇక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం గమనార్హం. కొందరు సోషల్ మీడియా వేదికగా ఇదే అంశంపై కామెంట్లు సైతం చేస్తున్నారు.