ఇటు దేశంలో అటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ప్రశాంత్ కిషోర్ వరుసగా భేటీ అవుతుండటం, ఆ పార్టీలో చేరుతుండటం, ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులపై ఇచ్చిన సలహాలే దీనికి కారణం.
ఇలాంటి సమయంలో హఠాత్తుగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. శనివారం ఉదయం 9:30 కి ప్రగతి భవన్ చేరుకున్న పీకే అక్కడే కేసీఆర్ తో చర్చలు జరపడం హాట్ టాపిక్ గా మారింది. పైగా రెండో రోజైన ఆదివారం కూడా ఈ చర్చలు కొనసాగుతుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇటీవలే ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ సోనియా తో భేటీ అయిన ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ , హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో చర్చలు జరుపుతుండటం గమనార్హం. 2024 పార్లమెంట్ ఎన్నికల కోసమే తాను కాంగ్రెస్ కి పని చేయనున్నట్లు ప్రశాంత్ కిశోర్ చెప్పారు. మరోవైపు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరుతారన్న చర్చ జరుగుతోంది. ఈ చర్చ అనధికార సమాచారంతో జరుగుతుంటే, మరోవైపు రాజకీయ లీకులు హాట్ టాపిక్ అయ్యాయి.
దేశ వ్యాప్తంగా 370 స్థానాల్లో కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగాలని.. మిగతా స్థానాల్లో మిత్రపక్షాలతో కలిసి పోటీ చేయాలని తమ భేటీలో పీకే సూచించారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన కాంగ్రెస్ కమిటీ.. సోనియా గాంధీకి నివేదిక ఇచ్చింది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి , తదుపరి చర్యలు ఏంటనే స్పష్టత రావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో పీకే హైదరాబాద్ రావడం, ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అవడం చర్చనీయాంశంగా మారింది.
శనివారం ఉదయం 9:30 కి ప్రగతి భవన్ చేరుకున్న పీకే ఆ రోజంతా చర్చలు జరిపారు. రెండో రోజైన ఆదివారం కూడా సీఎం కేసీఆర్ తో పీకే చర్చలు కొనసాగనున్నాయని, ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఢిల్లీకి ప్రశాంత్ కిషోర్ తిరిగి బయలుదేరి వెళ్లనున్నట్లు చెప్తున్నారు.
కాంగ్రెస్ అధినేత్రితో చర్చల తర్వాత సీఎం కేసీఆర్ తో కొనసాగుతున్న రాజకీయ చర్చల మర్మం ఏంటనే చర్చ, సందేహం రావడం అత్యంత సహజం. ఈ ఎపిసోడ్ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు కుదిర్చేందుకేనా అనే టాక్ కూడా ఉంది. ఇలాంటి సమయంలోనే మరో చర్చ జరుగుతోంది. ఈనెల 27న జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై పీకే వివరించారని చెప్తున్నారు.