అరచేతిలో స్మార్ట్ ఫోన్..దాదాపుగా ఫ్రీ వైఫై…లేకుంటే కారు చౌకగా డైలీవారీ మొబైల్ డేటా…వెరసి ప్రపంచాన్ని పిడికిటిలో బంధిస్తున్నారు చాలామంది యువత. అయితే, ఈ సౌకర్యాలను, టెక్నాలజీని చాలామంది ఉద్యోగాలు, చదువులకు ఉపయోగిస్తుంటే…మరికొంతమంది మాత్రం తెలిసీ తెలియని వయసులో తమకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని దుర్వినయోగం చేస్తూ చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు.
తొమ్మిది, పదో తరగతి చదువుకుంటున్న పిల్లలు సైతం పోర్న్ వీడియోలకు బానిసలవుతున్న వైనం హైదరాబాద్ సైబర్ పోలీసులను కలవరపాటుకు గురిచేసింది. వారికి ఇస్తున్న పాకెట్ మనీని పోర్న్ వీడియోలు కొనేందుకు వినియోగిస్తున్న వైనం షాకిచ్చింది. చదువుపై ఫోకస్ చేయాల్సిన పిల్లలు… పొద్దస్తమానం పోర్న్ చూస్తూ.. వాటి గురించే ఆలోచిస్తూ.. బానిసలుగా మారుతూ.. చదువులు, జీవితాలు నాశనం చేసుకొంటున్న వైనం ఉలిక్కిపడేలా చేసింది.
తెలంగాణ పోలీసులు ఆన్లైన్లో సైబర్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇటువంటి భయంకర, విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పిల్లలకు నగ్న దృశ్యాలు, శృంగార వీడియాలు అమ్మి వ్యాపారం చేసే నీచుల రాకెట్ గుట్టురట్టయింది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ముఠాలు హైదరాబాద్‌లోని స్కూల్ పిల్లలకు సైతం వల విసురుతున్న వైనాన్ని పోలీసులు కనిపెట్టారు.
సంపన్న కుటుంబాల పిల్లల ఫోన్ నెంబర్లను సంపాదించి, వారికి హాట్ హాట్ పోర్న్ వీడియాలను పరిచయం చేస్తున్నాయి ఈ ముఠాలు. రూ.450కే 4,000 వీడియోలు పంపిస్తామంటూ పిల్లల బలహీనతలను రెచ్చగొడుతున్నాయి. నెలకు రూ.150 చొప్పున చెల్లిస్తే రోజుకు వంద వీడియోలు పంపిస్తామంటూ లేత మనసులపై వల విసురుతున్నాయి. ఆ మెసేజ్‌లకు ఆకర్షితులైన పిల్లలు నుంచి పేటీఎం తదితర అకౌంట్ల ద్వారా డబ్బులు పంపి అశ్లీల, నగ్న వీడియోల లింక్‌లు చూస్తున్నారు.
పోర్న్ వీడియోల క్రయ విక్రయాలకు ప్రధానంగా టెలిగ్రామ్‌ను వాడుతున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడింది. ఈ పాపిష్టి ముఠాలు ప్రధాన నగరాల్లో ఏజెంట్లను నియమించుకొని, వారి ద్వారా టెలిగ్రామ్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి, యువతకు వల విసురుతున్నట్టు పోలీసులు గుర్తించారు. డార్క్‌నెట్ సైట్లు, కొన్ని సోషల్ మీడియా యాప్‌ల వేదికగా జరుగుతున్న ఈ వ్యవహారంపై మహిళా భద్రత విభాగం దృష్టి సారించింది. ఇటువంటి వాటిపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.