జగన్ కాన్వాయ్ కోసం తిరుమల వెళ్లే భక్తుడి కారును అధికారులు తీసుకువెళ్లిన ఘటన ఏపీలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. జగన్ కాన్వాయ్ కోసం కారు కావాలంటూ తీసుకు వెళ్లడంపై బాధితులు లబోదిబోమన్నారు. కారును తీసుకెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ క్రమంలోనే ఆ ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తీవ్రంగా ఖండించారు. ఓ కుటుంబాన్ని నడిరోడ్డుపై దింపే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ఆయన నిలదీశారు.
కాన్వాయ్ కోసం ప్రజల కారును తీసుకెళ్లే స్థితికి రాష్ట్రం ఎందుకెళ్లిందని జగన్ ను కడిగిపారేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులే ఇటువంటి చర్యలకు పాల్పడడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. దీనిపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. ఈ ఘటనపై చంద్రబాబు ఫోకస్ చేయడం, రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో జగన్ తీవ్ర ఇరకాటంలో పడ్డారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్…సదరు సిబ్బందిపై చర్యలకు ఆదేశించారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆ భక్తుడి కారు తీసుకువెళ్లిన హోంగార్డు పి.తిరుపతిరెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎ.సంధ్యలను అధికారులు సస్పెండ్ చేశారు. కారు స్వాధీనం చేసుకున్న ఘటనకు వారిని బాధ్యులను చేస్తూ ఈ చర్యలు తీసుకున్నారు. అలాగే, ఆ కారు యజమాని శ్రీనివాస్ గురించి ఏపీ సీఎం కార్యాలయం ఆరా తీసింది. కారు స్వాధీనం ఘటనపై పూర్తి వివరాలు సేకరించింది. ఆ కారును తీసుకెళ్లాలని ఫోనులో శ్రీనివాస్‌కు పోలీసులు చెప్పారు. ఏది ఏమైనా చంద్రబాబు స్పందించిన గంటల వ్యవధిలోనే ఈ వ్యవహారం సద్దుమణగడం విశేషం.