తెలంగాణ రాజకీయాల్లో ఉనికి చాటుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వైఎస్ఆర్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇందుకోసం పాదయాత్ర రూపంలో ప్రజలను కలుస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో హాట్ టాపిక్ గా ఉన్న అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారనే ఇమేజ్ పొందిన షర్మిల నిరుద్యోగుల అంశం తర్వాత రైతుల విషయంలో గలం విప్పుతున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో నిర్వహించిన రైతు గోస ధర్నాలో పాల్గొన్న షర్మిల ఈ సందర్భంగా కేసీఆర్ సర్కారును ఇరుకున పెట్టేలా విమర్శలు గుప్పించారు.
కొత్తగూడెం ఎమ్మెల్యే చేసిన అరాచకానికి ఓ కుటుంబం సూసైడ్ చేసుకుందని ఆవేదన వ్యక్తం చేసిన వైఎస్ఆర్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇప్పటి వరకు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ను ఏమైనా అంటే వరి కంకులతో కొట్టమన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావించిన షర్మిల… టీఆర్ఎస్ పార్టీని ఏమైనా అంటే వరికంకులతో కొట్టమంటున్నారు మరి… తప్పులు చేస్తున్న సీఎం కేసీఆర్ ను దేనితో కొట్టాలని ప్రశ్నించారు.
కేసీఆర్ సీఎంగా రెండు సార్లు అధికారంలో ఉన్నా వ్యవసాయ రంగం నాశనమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులు ఎలా బతుకుతున్నారు అనేది చూడకుండా.. రైతులు కోటీశ్వరులయ్యారు.. కార్లలో తిరుగుతున్నారు… బంగారు ఆసాములు అయ్యారని కేసీఆర్ పొగుడుకుంటున్నారని షర్మిల అన్నారు. వాస్తవంలో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 8 సంవత్సరాలలో వేల మంది ఆత్మహత్య చేసుకున్నారంటే.. కోటీశ్వరులై.. కార్లు ఎక్కువై ఆత్మహత్యలు చేసుకున్నారా..? అని షర్మిల ప్రశ్నించారు.
25వేలు రైతు దగ్గర దోచుకుని.. 5వేలు రైతు బంధు ఇస్తున్నారని షర్మిల ఆరోపించారు. ఉచిత విత్తనాలు, ఎరువులు, పంట నష్టపోతే.. పరిహారం ఇవ్వడం వంటి పథకాలన్నీ బందుపెట్టి.. కేవలం 5వేలు ఇచ్చే రైతు బంధు ఇచ్చి గొప్పలు చేసుకుంటున్నారని షర్మిల ఆరోపించారు. అసలు కౌలు రైతులను రైతుల్లా చూస్తున్నారా..? భూమి లేని పేద రైతులు కౌలు రైతులు.. ఉన్న భూములు అమ్ముకుని కౌలుకు చేసుకుంటున్న నిరుపేద భూములు లేని కౌలు రైతులను ఆదుకునే ఆలోచనే చేయడం లేదు.
కౌలు రైతులకు రుణాలు లేవు.. రైతు బంధు లేదు.. ఏ ఒక్క సహాయం అందడం లేదని షర్మిల అన్నారు. బ్యాంకుల వాళ్లు ఇళ్లకు వచ్చి తాళాలు వేసి అప్పుల కోసం వేధిస్తుంటే.. అవమానాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన కేసీఆర్ .. ఏ పంట వేసుకున్నా లాభాలు వచ్చే పరిస్థితి లేదంటున్నా పట్టించుకోవడం లేదన్నారు.