కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబోలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి రెడీగా ఉంది. మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులందరికీ ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. సందేశాత్మక చిత్రాలతోనూ కమర్షియల్ హిట్ లు కొట్టే డైరెక్టర్ కొరటాల, సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్న చిరుల కాంబోలో వస్తోన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇటీవల వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ఆ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. ఈ క్రమంలోనే ఈ చిత్ర ప్రమోషన్ జోరు పెంచిన చిత్ర యూనిట్.. తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ చేయనుంది. ‘భలే భలే బంజారా’ పాటను ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ అనౌన్స్ మెంట్ ను చిరు, చరణ్, కొరటాల శివలు వెరైటీగా ప్రమోట్ చేశారు. చిరు, చెర్రీల మధ్య సాగే సరదా సంభాషణతో ఈ వీడియో హిలే రియస్ గా ఉంది. తండ్రీ కొడుకులను కొరటాల శివ ఆ పాట గురించి అడుగుతుంటే…దానికి చిరు ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు.
నాటు నాటులో తారక్ తో కుమ్మేసిన చరణ్ లాంటి కుర్రాళ్లతో కలిసి తాను డ్యాన్స్ చేయగలనా అని ఆలోచిస్తున్నానని చిరు అనడంతో దానికి చెర్రీ కౌంటర్ ఇచ్చాడు. తాము ఎంత చేసినా మీరు వచ్చి ఒక్క స్టెప్ వేస్తే ఆ గ్రేస్ కి, ఎక్స్ ప్రెషన్స్ కి తామంతా అవుట్ అని చిరునుద్దేశించి చెర్రీ అనడంతో అక్కడ నవ్వులు పూశాయి. చాలా మందితో పాటు సురేఖ కూడా తామిద్దరం కలిసి డ్యాన్స్ చేస్తే చూడాలనుకుంటుందని చిరు చెప్పారు.
‘ఏరా సాంగ్ లో నన్ను డామినేట్ చేద్దామనుకుంటున్నావా’ అని చిరు అడగడంతో..డామినేట్ చేయను కానీ…తగ్గను డాడీ అని చరణ్ చెబుతూనే పంచ్ వేస్తాడు. ‘నేను నీ బాబుని రా .. సరే..ఇక్కడెందుకు కబుర్లు కెమెరా ముందు అక్కడ చూసుకుందాం’ అని చరణ్ తో చిరు ఛాలెంజ్ చేశారు. బంజారా పాటకు ముందు షూట్ చేసిన ఈ వీడియో ఇపుడు వైరల్ అయింది.