బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ కలకలం సినీ, రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. టాస్క్‌పోర్స్ పోలీసులు నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్ లో దాదాపు 150 మంది దొరకడం, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా డాటర్ కొణిదెల నిహారికలతో పాటు పలువురు సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖుల పిల్లలు పట్టుబడడం కలకలం రేపింది. అయితే, ఆ 150 మందిలో కొందరే డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు చెబుతున్నారు.
ఆ ఘటనతో పాటు డ్రగ్స్ కు బానిసైన ఓ యువకుడు సూసైడ్ చేసుకోవడం తెలంగాణలో డ్రగ్స్ కల్చర్ పై చర్చకు దారి తీసింది. పబ్ లలో డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని, ఖరీదైన డ్రగ్స్ నగరంలో సిగరెట్లు దొరికినట్లు ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రగ్స్ వాడకంపై పోలీసులు, ప్రభుత్వం ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలోనే నగరంలో డ్రగ్స్ ను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది.
అందులో భాగంగానే త్వరలో తెలంగాణలో డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో డ్రగ్ టెస్ట్‌లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నోట్లోని లాలాజలం శాంపిల్ గా తీసుకొని ఈ డ్రగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్ట్ ద్వారా రెండు నిమిషాల్లో ప్రాథమిక రిజల్ట్ వచ్చేస్తుంది. పాజిటివ్ రిజల్ట్ వస్తే మూత్రం, రక్త పరీక్షలతో పూర్తి స్థాయి నిర్ధారణకు వస్తారు. కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో ఆల్రెడీ అమల్లో ఉన్న ఈ విధానాన్ని తెలంగాణలోనూ ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
డ్రంక్ అండ్ డ్రైవ్ లో బ్రీత్ అనలైజర్ల మాదిరిగానే డ్రగ్స్ తీసుకున్నవారిని గుర్తించేందుకు డ్రగ్ అనలైజర్లు వాడకంలో ఉన్నాయి.డ్రగ్ అనలైజర్లతో పరీక్షలు నిర్వహించి, వాటి ఫలితాలను అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. డ్రగ్ తీసుకుంటే ఎరుపు రంగులో, లేకపోతే ఆకుపచ్చ రంగులో చుక్కలు వస్తాయి. ఈ డ్రగ్ అనలైజర్ పరీక్షలో గంజాయి, హాష్ ఆయిల్, కొకైన్, హెరాయిన్ సేవించేవారు పట్టుబడతారు. నగరంలో కీలకమైన ప్రాంతాల్లో డ్రగ్ అండ్ డ్రైవ్ చేయనున్నారు.