ముస్లింలు ప్రార్థనలు నిర్వహించే మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లలో వచ్చే అజాన్, ప్రసంగాలపై గతంలో సింగర్ సోను నిగమ్, తాజాగా అనురాధా పడ్వాల్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం దేశంలో పెను దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యాఖ్యలపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. మే3లోపు మసీదుల్లోని లౌడ్ స్పీకర్లను మహారాష్ట్ర ప్రభుత్వం తొలగించాలని, లేదంటూ మసీదుల బయట లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసి హనుమాన్ చాలీసాను ఎంఎన్ఎస్ వినిపిస్తారని రాజ్ థాకరే హెచ్చరించారు.
ఈ క్రమంలోనే తన చిన్నాన్న రిజ్ థాకరేపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కుమారుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే సైటెర్లు వేశారు. లౌడ్ స్పీకర్లను తొలగించే అంశంపై మాట్లాడుతున్న వారు… దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై మాట్లాడితే బాగుంటుందని చురకలంటించారు. నానాటికీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలపై వారు మాట్లాడితే బాగుంటుందన్నారు. గత రెండు, మూడేళ్లలో ఏం జరిగిందనే విషయంపై మనం మాట్లాడుకుందామని మోడీ సర్కార్ ను, రాజ్ థాకరేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అంతుకుముందు, ప్రధాని మోదీకి కూడా రాజ్ థాకరే ఒక విన్నపం చేశారు. ముంబైలోని ముస్లిం ప్రాంతాల్లో ఉన్న మసీదులు, మదరసాలపై రెయిడ్ చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ నివసిస్తున్న వారంతా పాకిస్థాన్ మద్దతుదారులేనని, ఆ ప్రాంతాల్లో ఏం జరుగుతోందనేది ముంబై పోలీసులకు తెలుసని షాకింగ్ ఆరోపణలు చేశారు. వారిని మన ఎమ్మెల్యేలు ఓట్ బ్యాంక్ గా చూస్తున్నారని, వారికి ఆధార్ కార్డులు లేకపోయినా… ఎమ్మెల్యేలు వాటిని తయారు చేయించి ఇస్తున్నారని మండిపడ్డారు.