రాజకీయ నాయకులను కొంతమంది ఊసరవెల్లులతో పోలుస్తుంటారు. ఊసరవెల్లి రంగులు మార్చినంత సులువుగా…పరిస్థితులకు తగ్గట్లుగా…తన మనుగడను కొనసాగించేందుకు వీలుగా ఊసరవెల్లి రంగులు మారుస్తుంటుంది. అట్లాగే రాజకీయ నేతలు కూడా తమ స్వార్థం, మనుగడ, అస్థిత్వం కోసం పార్టీలు మారుస్తుంటారు. గెలుపు గుర్రాలు ఎక్కడం..విజయావకాశాలున్న పార్టీలోకి లాంగ్ జంప్, పోల్ జంప్ చేయడం మన దేశంలోని రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య.
ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సీఎం జగన్ బలవంతుడిగా కనిపించినా…ఓ బలహీన నాయకుడు అని గంటా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త కేబినెట్ కూర్పుతో అది స్పష్టమైందని, మంత్రి పదవులు ఇవ్వలేదని దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం ఇదే మొదలని గంటా షాకింగ్ కామెంట్లు చేశారు. తన 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో మంత్రి పదవి దక్కలేదని సీఎం దిష్టిబొమ్మలు, టైర్లు తగలబెట్టడం ఇదే ప్రథమం అని ఆశ్చర్యపోయారు.
విద్యాశాఖపై సమీక్ష నిర్వహిస్తే సంబంధింత మంత్రి రాకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు మంత్రి పదవులు ఇచ్చినంత మాత్రాన బీసీలు వైసీపీని నమ్ముతారా? అంటూ గంటా ప్రశ్నించారు. బీసీలు ఎప్పుడూ టీడీపీ పక్షమేనని గంటా చెప్పారు. ఎన్ని కుతంత్రాలకు పాల్పడినా టీడీపీకి బీసీలను ఎవరూ దూరం చేయలేరని అన్నారు. ఎన్నికలకు ఐదారు నెలల ముందు నుంచి పొత్తులు, సర్దుబాట్లు ఉంటాయని, ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ టీడీపీలోకి వలసలు ఎక్కువవుతాయని గంటా స్పష్టం చేశారు.
అయితే, మొన్న మొన్నటి వరకు ఫ్యాన్ గాలి కింద సేద తీరుతూ వైసీపీ కండువా కప్పుకోవాలని తహతహలాడిన గంటా…సడెన్ గా యూ టర్న్ తీసుకొని సైకిల్ ఎక్కేలా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత, జగన్ పై మంత్రుల అసహనం, తన రాకను కొందరు వైసీపీ నేతలు వ్యతిరేకించడం వంటి కారణాలతోనే టీడీపీ గంటను గంటా కొట్టారని అంటున్నారు. మరి, గంటా తాజా కామెంట్లపై వైసీపీ నేతల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.