ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ తీరుపై ఇటు విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా….అటు ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ సవాంగ్ రాజీనామా చేయాలని….ఏపీలో ‘రూల్ ఆఫ్ లా’ అమలు కావడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఏపీ డీజీపీని పలుమార్లు కోర్టుకు పిలిపించినా మార్పు రాలేదని, ప్రతిసారి ఇలా జరిగితే ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీలో చాలామంది అధికారులు తాము చట్టం కంటే ఎక్కువనే భావనలో ఉన్నారని సవాంగ్ ను ఉద్దేశించి కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఏపీలో మాత్రమే ఇలాంటి పరిస్థితి ఉందని, చట్టం కంటే తాము ఎక్కువని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు భావించొద్దని హితవు పలికింది. ఓ కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో హైకోర్టుకు హాజరైన డీజీపీ సవాంగ్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ లనుద్దేశించి హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఎస్సైగా పనిచేస్తున్న ఓ అధికారికి కోర్టు ఆదేశాల మేరకు సీఐగా పదోన్నతి కల్పించినప్పటికీ.. తామిచ్చిన ఆదేశాల ఉల్లంఘన జరిగిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగమే అన్నింటికంటే, అందరికన్నా మహోన్నతమైనదని, అందరం దానికి లోబడాల్సిందేనని తేల్చి చెప్పింది. గతంలో డీజీపీ కోర్టుకు హాజరైతే.. సిన్సియర్ ఆఫీసర్ అనే భావన కలిగిందని, ఈ పదోన్నతి కేసు వ్యవహారం నేపథ్యంలో ఆ అభిప్రాయాన్ని బలవంతంగా మార్చుకోవాల్సి వచ్చిందని హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. డీజీపీ కార్యాలయంలో కింది స్థాయి అధికారులపై డీజీపీ పర్యవేక్షణ కొరవడిందని, కిందిస్థాయి ఉద్యోగుల నిర్లక్ష్యం వల్లే డీజీపీని మళ్లీ మళ్లీ కోర్టుకు పిలవాల్సి వస్తోందని వెల్లడించింది. ఆ పదోన్నతి విషయంలో కోర్టు ఉత్తర్వుల అమలులో ఆలస్యానికి గల కారణాలపై వివరణ ఇస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఐజీ లడ్హా, ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్‌రావులను కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 25కు వాయిదా వేసింది.
సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా లా అండ్ ఆర్డర్ వ్యవహారంలో పోలీస్ బాస్ డీజీపీ మాటే ఫైనల్. ఏదైనా విషయంలో ప్రతిపక్షాలు గొడవ చేసినా… పోలీసుల తీరుపై కోర్టుకు వెళ్లినా సంబంధిత పోలీసు అధికారులు కోర్టులకు సమాధానమిచ్చి సరిపెడుతుంటారు. దాదాపుగా డీజీపీ స్థాయి వ్యక్తి కోర్టుకు వెళ్లాల్సిన అవసరం అన్ని సందర్భాల్లో ఉండదు. అయితే, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు మాత్రం ఆ అవసరం చాలాసార్లు రావడం గమనార్హం. వేర్వేరు కేసుల్లో సవాంగ్ ఇప్పటికి నాలుగుసార్లు కోర్టుకు హాజరయ్యారు. గతంలో ఓ దంపతులకు సంబంధించి హెబియస్‌కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా సవాంగ్ తొలిసారి హైకోర్టులో హాజరయ్యారు. విశాఖపట్టణంలో టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు పర్యటన వ్యవహారం నేపథ్యంలో సవాంగ్ రెండోసారి కోర్టు మెట్లెక్కారు. అక్రమ మద్యం తరలింపు వ్యవహారంలో పట్టుబడిన వాహనాల అప్పగింతలో జాప్యం నేపథ్యంలో సవాంగ్ మూడోసారి కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. తాజాగా, ఎస్ఐ పదోన్నతి వ్యవహారంలో నాలుగోసారి కోర్టుకు సవాంగ్ హాజరుకావాల్సి వచ్చింది.