మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిఫై టీడీపీ నేతలు అవినీతి ఆరోపణలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ తొలిి మంత్రివర్గంలో అవినీతి బాహుబలి బాలినేని అని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. బాలినేని సకుటుంబ సపరివారంగా వందల కోట్లు కొట్టేశారని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో జగన్ జే ట్యాక్స్, ప్రకాశం జిల్లాలో బాలినేని బీ ట్యాక్తో దోపిడీ చేశారని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు.
జగన్ బంధువునని ఈ మూడేళ్లలో బాలినేని దారుణంగా దోచుకొన్నారని, ఆయన అవినీతి సంపాదన రూ.1,700 కోట్లు దాటిపోయిందని ఆరోపించారు. మంత్రి బాలినేని కారులో హవాలా సొమ్ము రూ.5 కోట్లు దొరికిందని, కారుపై బాలినేని స్టిక్కర్ ఉన్నా ఏ చర్యా తీసుకోలేదని ఆరోపించారు. టీడీపీ హయాంలో ఒక యూనిట్ విద్యుత్‌ను బయట రూ.ఆరుకు కొనుగోలు చేస్తే ఇప్పుడు రూ.22కు కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు.
విద్యుత్ కొనుగోళ్లలో భారీగా కమీషన్లు వసూలు చేసి సీఎం, విద్యుత్ మంత్రి బాలినేని పంచుకొంటున్నారని ఆరోపించారు. విద్యుత్ కొనుగోళ్లలో మంత్రి వాటాగా రూ.500 కోట్లు దక్కాయని విద్యుత్ వర్గాల్లో ప్రచారం అవుతోందని, ప్రకాశం జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీలు విపరీతంగా ఉన్నాయని, వాటిని కూడా మంత్రి వదిలిపెట్టలేదని ఆరోపించారు. గనుల శాఖ పరిధిలో బాలినేని వసూళ్లు రూ.1,000 కోట్ల వరకూ ఉన్నాయని ఆరోపించారు.
ఇక, మంత్రి పదవి పోయినందుకు బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటూ ఈ ప్రకారం ఆంధ్రజ్యోతి దిన పత్రికలో వార్త వచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతిపై మంత్రి బాలినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు పార్టీనే ముఖ్యమని, మంత్రి పదవి కాదని తాను ఎప్పుడో చెప్పానని, కానీ, ఆంధ్రజ్యోతి తన గురించి చాలా నీచంగా రాస్తోందని బాలినేని ఆరోపించారు. ఇప్పటికైనా తనపై విష ప్రచారాన్ని మానుకోకపోతే ఆ పత్రికపై పరువునష్టం దావా వేస్తానని బాలినేని చెప్పారు.
వైయస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నాలుగేళ్ల ముందే మంత్రి పదవిని వదులుకుని వైయస్ జగన్ వెనుక నిలబడ్డానని బాలినేని అన్నారు. జగన్ కు తాను వీరాభిమానినని చెప్పారు. కేబినెట్ మొత్తాన్ని తొలగిస్తున్నానని జగన్ అన్నప్పుడే తాను బహిరంగంగా పూర్తి మద్దతును ప్రకటించానని అన్నారు.