విద్యుత్ చార్జీల పెరుగుదల, కరెంటు కోతలపై బాదుడే బాదుడు పేరుతో టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలపై పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి టీడీపీ నేత ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. క్షేత్ర స్థాయికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను వివరించి చెప్పాలని చంద్రబాబు సూచించారు.
ఏపీలో విద్యుత్ కోతలు, పెరిగిన కరెంట్ చార్జీలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వారికి జగన్ పాలన ఎలా ఉందో వివరించాలని కోరారు. ఏపీలో పరిశ్రమలకు విద్యుత్ కోతలు కొనసాగితే కార్మికులకు ఉపాధి కరవవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పంటలకు నీరందక రైతులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో జగన్ విద్యుత్తును పీకేస్తున్నారని, ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి పీకేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు.
మరోవైపు, జగన్ పై టీడీపీ జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ నారా లోకేశ్ మండిపడ్డారు. బీహార్ లో 500 టన్నుల స్టీల్ బ్రిడ్జిని దోచేసిన ఘటనతో ఏపీ ప్రభుత్వాన్ని లోకేష్ పోల్చారు. బీహార్ లోని ఆరా సోనె కెనాల్ మీద బీహార్ ప్రభుత్వం నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని దొంగలు మొత్తం విప్పేసి దోచుకెళ్లిపోయారని, అలాగే జగన్ కూడా తన పిచ్చి, అవినీతి, అరాచకాలు, అసమర్థతతో రాబోయే తరాల భవిష్యత్ ను దొంగిలించేస్తున్నారని మండిపడ్డారు.
ఎంతో వెనుకబడిపోయిన ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ గాడిలో పెట్టాలంటే ఇంకెంత కాలం పడుతుందో ఊహించుకోవడం కష్టమని లోకేష్ విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అంధకారాంధ్రప్రదేశ్ అయిందని ఎద్దేవా చేశారు.