- జీవిత చరమాంకంలో.. బతుకు పాట్లు!
- వారికి రూ.2,100 కోట్లు బాకీ
- పీఎఫ్, బీమా, గ్రాట్యుటీ సొమ్ము
- ఏడాదికాలంగా పెండింగ్
- గతంలో రిటైరైన రోజే చేతికి
- సన్మానించి గౌరవంగా వీడ్కోలు
- నేడు పరిస్థితి తలకిందులు
నవ్యాంధ్రలో పదవీవిరమణ చేసిన ఉద్యోగుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. రిటైరైన ఆరేడు నెలలకు కూడా పెన్షన్ రాకపోగా.. సర్వీసులో ఏపీజీఎల్ఐ, పీఎఫ్ పేరిట నెలనెలా దాచుకున్న సొమ్ములు కూడా చేతికి అందడం లేదు. వీటికి తోడు సర్కారు గ్రాట్యుటీ మొత్తం ఇస్తుందని.. జీవిత చరమాంకంలో కొండంత అండగా ఉంటుందన్న ధీమా సైతం సన్నగిల్లుతోంది.
చట్టబద్ధంగా వారికి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా జగన్ సర్కారు వారి జీవితాలతో చెలగాటమాడుతోంది. గతంలో రిటైర్మెంట్ రోజునే అందే ప్రయోజనాలు.. ఇప్పుడు ఏడాది దాటినా దక్కడంలేదు. గ్రాట్యుటీ, పీఎ్ఫతోపాటు బీమా బాండ్ల గడువు తీరినా అంతే! ఈ మొత్తం దాదాపు రూ.2,100 కోట్లు. ఈ సొమ్ములో పీఎఫ్, జీఎ్సఎల్ఐ.. ఉద్యోగులు సర్వీసులో ఉన్నప్పుడు నెలనెలా దాచుకున్న సొమ్మే. అంటే… అచ్చంగా అవి ఉద్యోగుల డబ్బులే.
అదేవిధంగా ఉద్యోగులు తమకొచ్చే జీతాన్నిబట్టి ఇంత మొత్తం బీమా బాండ్లు కొనాలని ప్రభుత్వం చెబుతుంది. అలా జీఎ్సఎల్ఐ బాండ్లను ఉద్యోగులు తమ సొమ్ముతోనే కొనుగోలు చేస్తారు. ఆ సొమ్ములు ప్రభుత్వం వద్ద ఉంటాయి. వాటి కాలపరిమితి తీరిపోగానే చెల్లించాలి. కానీ ఇవ్వడం లేదు. దీంతో అవసరానికి డబ్బుల్లేక రిటైర్డు ఉద్యోగులు ఆవేదనలో ఉన్నారు.
ఇప్పటికీ ఎదురుచూపులే..
గత ఏడాది కాలంలో రాష్ట్రంలో దాదాపు 25 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు పదవీ విరమణ చేశారు. వీరికి రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల చొప్పున పీఎఫ్, గ్రాట్యుటీ, బీమా సొమ్ములు రావలసి ఉంది. ‘ఇదిగో ఇస్తున్నాం’ అంటూ గత ఏడాది ఆగస్టులో జగన్ ప్రభుత్వం రూ.235 కోట్లు ఇస్తున్నట్లు జీవో జారీ చేసింది. కానీ పైసా విడుదల చేస్తే ఒట్టు. సీఎ్ఫఎంఎ్సలో పెండింగ్లో పెట్టేశారు.
గతంలో ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ రోజునే పదవీ విరమణ ప్రయోజనాలన్నీ అందించేవారు. వారిని ఘనంగా సన్మానించి.. ఈ మొత్తాలను అందించి గౌరవంగా వీడ్కోలు పలికే వారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పదవీ విరమణ ప్రయోజనాలపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పదే పదే అడుగగా.. క్రిస్మ్సకు సగం, సంక్రాంతికి మిగతా సగం ఇచ్చి అందరికీ చెల్లింపులు చేసేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఉగాది కూడా పోయింది. అయినా డబ్బులు మాత్రం రాలేదు. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదని, ఉద్యోగుల రిటైర్మెంట్ రోజే వారికొచ్చే ఆర్థిక ప్రయోజనాలను గౌరవపూర్వకంగా అందించేవారని గుర్తు చేసుకుంటున్నారు. పీఆర్సీ కోసం చేసిన ఆందోళనల సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు ఈ బకాయిల గురించి కూడా మాట్లాడారు. కానీ ప్రభుత్వం హామీ ఇవ్వలేదు.