ఆంధ్రప్రదేశ్లో త్వరలో కొత్త కేబినెట్ కొలువుతీరబోతోన్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ ఇప్పటికే కొత్త మంత్రి వర్గం ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చేయడంతో…మంత్రుల రేసులో ఉన్నవారు టెన్షన్ పడుతున్నారు. జగన్ కేబినెట్లో కొత్త మహిళా మంత్రులుగా ఎవరెవరు ఉండబోతున్నారన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే నలుగురు మహిళా ఎమ్మెల్యేల పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాతోపాటు, అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్, గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీల పేర్లు మంత్రివర్గం రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కుల సమీకరణలు, రాజకీయ సమీకరణాలను బట్టి వీరికి మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. వీరిలో, ఉషా శ్రీ చరన్ బీసీ కాగా, ఆమె భర్త రెడ్డి సామాజిక వర్గం. దీంతో, ఇటు బీసీకి మంత్రి పదవి ఇచ్చినట్లుంటుంది…అటు పెత్తనం అంతా రెడ్డి నేతదే అవుతుందన్న టాక్ వస్తోంది.
ఇలా మంత్రి పదవి రేసులో ఉన్న ఉషా శ్రీ చరణ్ కు సొంత పార్టీ మహిళా కౌన్సిలర్ సంచలన ఆరోపణలు చేశారు. తన దగ్గర ఉషా శ్రీ చరణ్ అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించడం లేదని, అదేమని అడిగితే తనను తన అనుచరులతో కొట్టించారని కల్యాణదుర్గం కౌన్సిలర్ ప్రభావతి సంచలన ఆరోపణలు చేశారు. ప్రభావతి వద్ద నుంచి ఉషాశ్రీ చరణ్ రూ.1.50కోట్లను అప్పుగా తీసుకున్నారని, అందులో రూ.90 లక్షలకు తిరిగి చెల్లించగా…మిగతా సొమ్ము ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది.
అయితే, మిగిలిన డబ్బును చెల్లించని ఉషా శ్రీచరణ్…బకాయి డబ్బుల గురించి అడిగితే కోప్పడ్డారని తెలుస్తోంది. అంతేకాకుండా నన్నే నిలదీస్తావా? అన్న ఆగ్రహంతో తన అనుచరులతో కౌన్సిలర్ ప్రభావతిపై ఎమ్మెల్యే దాడి చేయించారని ప్రచారం జరుగుతోంది.. ఈ దాడి మునిసిపల్ కార్యాలయంలోనే జరిగిందని తెలుస్తోంది. అయితే, ఈ వ్యవహారంపై ఉషా శ్రీ చరణ్ స్పందించాల్సి ఉంది. మంత్రి పదవి రేసులో ఉన్నందునే ఆమెపై ఇలా ఆరోపణలు చేస్తున్నారా అన్న టాక్ కూడా అనంతపురం వైసీపీ వర్గాల్లో జరుగుతోంది.