సీఎం జగన్ మెప్పు పొందేందుకు బూతుల మంత్రిగా టీడీపీ నేతలు విమర్శలు గుప్పించే కొడాలి నాని మొదలు….ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ వరకు అందరూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లపై విమర్శలు గుప్పించిన వారే. అయితే, అదంతా మంత్రి పదవి ఇచ్చిన మత్తు అని..ఆ మత్తు దిగిపోయాక తాము ఎమ్మెల్యేలమని కొందరు మంత్రులకు గుర్తొస్తుంది కాబోలు.
ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబుపై డిప్యూటీ సీఎం, మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రశసంలు కురిపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు విజ్ఞత కలిగిన ముఖ్యమంత్రి అని ధర్మాన కొనియాడడం ఇపుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు మంచి సీఎం అన్న విషయాన్ని తాను కాదని చెప్పలేనని ఆయన అన్నారు. అంతేకాదు, తాను మంత్రిగా దిగి పోతున్నానని… తన సోదరుడు ధర్మాన ప్రసాదరావు మంత్రి కాబోతున్నారంటూ బ్రేకింగ్ న్యూస్ చెప్పారు ధర్మాన.
2009లో వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత తాను జగన్ వెంట నడిచానని, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశానని గుర్తు చేసుకున్నారు ధర్మాన. గతంలో తన తమ్ముడు ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఉన్నప్పుడు నరసన్నపేట ఉపఎన్నికలో తనపై మరో సోదరుడు రామదాసును బరిలోకి దించాడని, కానీ, ఆ ధర్మయుద్ధంలో తానే గెలిచానని ధర్మాన కృష్ణదాస్ తన తమ్ముడిపై ఉన్న అసంతృప్తిని పరోక్షంగా వెల్లడించారు.
అయితే, 2019 ఎన్నికల్లో తన తమ్ముడు ప్రసాదరావు, తాను ఇద్దరం వైసీపీ తరఫున గెలిచామని అన్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ తనను గుర్తించి డిప్యూటీ సీఎం చేశారని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఈ మూడేళ్లు ఖాళీగా ఉన్న తన తమ్ముడు రేపో, మాపో మంత్రి అవుతాడంటూ పేపర్ లీక్ చేశారు. ఇక, ఎవరు మంత్రిగా ఉన్నా.. తమ కుటుంబమంతా ఒక్కటేనంటూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు టైపులో కబుర్లు చెప్పారు కాబోయే మాజీ డిప్యూటీ సీఎం.
కుటుంబమంతా ఒకటే అన్న పెద్దమనిషి…తనపై ప్రసాదరావు ఇంకో తమ్ముడిని పోటీ పెట్టిన విషయం ఇప్పుడు విషంలా ఎందుకు కక్కారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా…తనకు మంత్రి పదవి కొనసాగింపు లేకపోవడంతో ఆ అసహనాన్ని మంత్రి తన మాటల రూపంలో వెల్లడించారని కామెంట్లు వస్తున్నాయి.