కొత్త మంత్రివర్గంలో తనకు చోటు దక్కుతుందా లేదా అన్న టెన్షన్ లో నగరి ఎమ్మెల్యే రోజా ఉన్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఈ మధ్య రోజా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నారు. తన కుటుంబ సభ్యులతో పలు ఆలయాలను దర్శించిన రోజా…మంత్రి కావాలని గట్టిగానే ప్రార్థిస్తున్నట్లుంది. అయితే, ఓ పక్క మంత్రి పదవి వస్తుందా రాదా అన్న టెన్షన్ లో ఉన్న రోజాకు ఆమె భర్త ఆర్కే సెల్వమణి కొత్త చిక్కులు తెచ్చిపెట్టారు.
ప్రముఖ సినీ దర్శకుడు, దక్షిణ భారత చలనచిత్ర కార్మిక సంఘాల సమ్మేళనం అధ్యక్షుడు, రోజా భర్త ఆర్కే సెల్వమణిపై అరెస్టు వారెంట్ జారీ కావడం సంచలనం రేపుతోంది. పరువునష్టం కేసులో సెల్వమణి విచారణకు హాజరుకాకపోవడంతో చెన్నైలోని జార్జి టౌన్ కోర్టు ఆయనపై వారెంట్ జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2016లో ఆర్కే సెల్వమణి, తమిళనాడులో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అన్బరసులు ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గన్నారు.
ఆ సమయంలో ప్రముఖ ఫైనాన్షియర్ ముకుంద్చంద్ బోద్రా అనే వ్యక్తి గురించి వ్యక్తిగతంగా పలు అభిప్రాయాలు వెల్లడించారు. అయితే, అవి తన ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సెల్వమణి, అన్బరసులపై చెన్నై జార్జిటౌన్ కోర్టులో బోద్రా పరువునష్టం దావా వేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు బోద్రా మృతిచెందారు. బోద్రా మరణానంతరం ఆ కేసును ఆయన కుమారుడు గగన్ బోద్రా కొనసాగిస్తున్నారు.
వారిద్దరూ ప్రత్యక్షంగా విచారణకు హాజరు కావాలని అంతకుముందే కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఈ రోజు విచారణ సందర్భంగా సెల్వమణి, అన్బరుసులతో పాటు వారి లాయర్లు కూడా హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే వారిద్దరికీ న్యాయమూర్తి వారిద్దరిపై బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీచేస్తూ విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు.