సమాజాన్ని మార్చేసే శక్తి ఏ రంగానికైనా ఉందంటే రాజకీయ రంగం మొదటి స్థానంలో నిలుస్తుంది. దశాబ్దాలుగా సాగే వ్యవహారాల్ని వెనువెంటనే మార్చేయటమే కాదు.. సరికొత్త రూపురేఖల్లోకి తీసుకెళ్లటం.. వర్తమానాన్ని గత చరిత్రగా మార్చే సత్తా రాజకీయ రంగానికి మాత్రమే ఉంది. ఏళ్లకు ఏళ్లుగా 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏకంగా 26 జిల్లాలుగా మారిపోయింది. దీనంతటికి కారణం.. ఏపీ ముఖ్యమంత్రి కమ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలగా చెప్పాలి. తాను అధికారంలోకి వస్తే కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తానన్న ఆయన.. తాను పవర్లోకి వచ్చిన మూడేళ్లకు తాను చెప్పింది చేతల్లో చేసి చూపించారు.
ఈ రోజు (సోమవారం) నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 26 జిల్లాలుగా మారిపోయింది. ఇప్పటివరకు ఉన్న 13 జిల్లాలు గత చరిత్రగా మారాయి. ఈ ఉదయం 9.05 నిమిషాలకు తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా కొత్త జిల్లాల్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ వెంటనే మొత్తం 26 జిల్లాల కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మిగిలిన శాఖలకు చెందిన జిల్లా అధికారులు కూడా నిమిషాల వ్యవధిలో తమ బాధ్యతల్ని చేపట్టారు. కొత్త జిల్లాల ప్రారంభం నుంచి.. ఆ ప్రక్రియ మొత్తం ముగిసి.. అన్ని జిల్లాల్లోనూ కొత్త బాధ్యతల్ని కేవలం 45 నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేశారు.
ఉదయం 9.45 గంటలకు 26 జిల్లాలకు సంబంధించిన అధికారులు వారికి కేటాయించిన విధుల్ని చేపట్టారు. ఇక.. కొత్తగా మారిన ఏపీ జిల్లాల ముఖ చిత్రాన్ని చూస్తే.. ఆసక్తికర అంశాలకు కొదవ లేదనే చెప్పాలి. కొత్త జిల్లాల విభజన తర్వాత విస్తీర్ణ పరంగా చూస్తే.. ప్రకాశం జిల్లా 14,322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అతి పెద్ద జిల్లాగా అవతరించగా.. జనాభా పరంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధిక జనాభా ఉన్న పెద్ద జిల్లాగా అవతరించింది.
నెల్లూరు జిల్లాలో మొత్తం 24.70 లక్షల మంది జనాభా ఉన్నారు. అంతేకాదు.. 8 అసెంబ్లీ నియోజకవర్గాలు.. 38 మండలాల చొప్పున నెల్లూరు.. ప్రకాశం జిల్లాలు పెద్దవిగా నిలిచాయి. ఆ తర్వాత ఎక్కువ మండలాలు ఉన్న జిల్లాగా వైఎస్సార్ కడప జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 36 మండలాలు ఉన్నాయి. ఇక.. అతి తక్కువ మండలాలు ఉన్న జిల్లాగా విశాఖ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ జిల్లాలో ప్రస్తుతం 11 మండలాలు మాత్రమే ఉండటం గమనార్హం. అటు విస్తీర్ణ పరంగా.. జనాభా పరంగా 26 జిల్లాల్లో అత్యంత చిన్న జిల్లాగా పార్వతీపురం మన్యం జిల్లా అవతరించింది.
మిగిలిన జిల్లాలకు భిన్నంగా నిలుస్తుంది విశాఖ జిల్లా. ఈ జిల్లాలో కేవలం 11 మండలాలు మాత్రమే ఉన్నాయి. కానీ.. జనాభా మాత్రం ఏకంగా 19.6 లక్షల మంది ఉన్నారు. ప్రతి జిల్లాలో 9 లక్షల ననుంచి 24.5 లక్షల జనాబా ఉన్నారు. కొత్త జిల్లాల్లోని నాలుగు జిల్లాలు నాలుగు చొప్పున రెవెన్యూ డివిజన్లు ఉంటే.. 12 జిల్లాలు మాత్రం 3 రెవెన్యూ డివిజన్లతో ఏర్పడ్డాయి. మిగిలిన 10 జిల్లాల్లో 2 మాత్రమే రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. 14 జిల్లాల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. ఐదు జిల్లాల్లో మాత్రం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
20 లక్షల జనాభా ఉన్న జిల్లాలుగా 12 ఉంటే.. రెండు జిల్లాల్లో మాత్రం 19 లక్షల జనాభా ఉంది. ప్రతి లోక్ సభ స్థానాన్ని ఒక జిల్లా యూనిట్ గా మారుస్తూ జిల్లాల పునర్ వ్యవస్థీకరణను పూర్తి చేసింది జగన్ సర్కారు. అదే సమయంలో ప్రతి సఅసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఏదో ఒక జిల్లాలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. అయితే.. ఇందుకు 12 నియోజకవర్గాలు మాత్రం మినహాయింపుగా చెప్పాలి. ఈ పన్నెండు నియోజకవర్గాలు మాత్రం ఒకే జిల్లాలో లేకుండా రెండేసి జిల్లాల్లో ఉండటం గమనార్హం.