టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లో హీరోయిన్ సాయి పల్లవికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కేవలం స్కిన్ షోనే నమ్ముకొని చాలామంది హీరోయిన్లు రాణిస్తోన్న ఈ జనరేషన్ లో తన అందం, అభినయంతో అలరిస్తోన్న ఈ తమిళమ్మాయికి యూత్ ఫిదా అయిపోయారు. శేఖర్ కమ్ముల , సాయి పల్లవిల కాంబోలో వచ్చిన ఫిదా చిత్రంలో వచ్చిండే పిల్లా మెల్లగ వచ్చిండే అంటూ సాయి పల్లవి వేసిన స్టెప్పుల యూట్యూబ్ ని షేక్ చేశాయి.
ఆ పాటకు యూట్యూబ్ లో దాదాపు 30 కోట్లకుపైగా వ్యూస్ వచ్చి ఆల్ టైం బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక, లవ్ స్టోరీ సినిమాలో ”దాని కుడీ భుజం మీద కడవా, దాని గుత్తెపు రైకలు మెరియా, అది రమ్మంటె రాదుర సెలియా.. దాని పేరే సారంగ దరియా” అంటూ జానపద సాహిత్యంతో వచ్చిన ఈ పాటలో తన స్టెప్పులతో సాయి పల్లవి అదరగొట్టింది. నెమలిలా నాట్యం చేస్తోన్న సాయి పల్లవి ఆటకు….తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ పాట తోడవడంతో….కుర్రకారంతా సారంగ దరియాకు పట్టం కట్టారు.
ఇక, నానితో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో దేవదాసిగా సాయి పల్లవి నటనకు విమర్శకులూ ప్రశంసలు కురిపించారు. ఇలా ఆన్ స్క్రీన్ పైన సింపుల్ గా ఉండే సాయి పల్లవి…ఆఫ్ స్క్రీన్ లోనూ అంతే సింపుల్ అని చాలా సార్లు ప్రూవ్ చేసింది. తాజాగా తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా మారిన ఈ స్టార్ హీరోయిన్…. రైతు కూలీగా మారి పొలంలో పసుపు కొమ్ములు ఏరింది. ఇదేదో ఫొటోషూట్, పబ్లిసిటీ కోసం అన్నట్లు కాకుండా…ఆ పొలంలోని కూలీలతో మమేకవుతూ వారి మధ్యలో కూర్చొని సాయి పల్లవి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
‘‘వేర్లతో భూమిలోకి బలంగా నాటుకుపోయాయి.. అయినా, పెకిలించి బయటకు తీసేశాం’’ అంటూ ఆ ఫొటోలను సాయిపల్లవి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో సాయి పల్లవి సింప్లిసిటీకి నెటిజన్లతోపాటు కో స్టార్లు, హీరోయిన్లు కూడా ప్రశంసలు కురిపించారు. ఆ ఫొటో చాలా నచ్చిందంటూ అనుపమ పరమేశ్వరన్ ఎమోజీ పెట్టి కామెంట్ చేయగా…‘‘నీలా ఎవరూ ఉండలేరు’’ అంటూ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కామెంట్ చేసింది. నిజమే, ఒకటి రెండు అనామక సినిమాలు చేసి కూలింగ్ గ్లాస్ పెట్టుకొని బిల్డప్ ఇచ్చేవారున్న ఈ రోజుల్లో ఇంత స్టార్ డమ్ ఉండి కూడా ఇంత సాదాసీదాగా ఉండడం ఒక్క సాయిపల్లవికి మాత్రమే సాధ్యం అనడం అతిశయోక్తి కాదేమో. ఏది ఏమైనా…కూలీ పిల్లగా మారిన రౌడీ బేబీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.