మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన చిత్రం `గని`. బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ ఇందులో హీరోయిన్గా నటించగా.. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర, నదియ కీలక పాత్రలను పోషించారు. మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ చేయగా.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి స్వరాలు అందించాడు.
బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ మూవీని రెనసాన్స్ ఫిల్మ్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్లపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ కలిసి నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వాయిదా పడుతూ పడుతూ చివరాఖరకు ఏప్రిల్ 8న గ్రాండ్‌గా విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే విసృతంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మేకర్స్.. నిన్న వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అట్టహాసంగా నిర్వహించారు.
ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విచ్చేశారు. ఈ సందర్భంగా గనిపై అల్లు అర్జున్ ఫస్ట్ రివ్యూ కూడా ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. `వరుణ్ పుట్టినప్పటి నుంచే మంచి అందగాడు. అందుకే చిన్నప్పటి నుంచి వరుణ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అతనిపై ఎంతో గౌరవం ఏర్పడింది. ట్రెండ్‌ను ఫాలో అవ్వకుండా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్నాడు. కథల ఎంపికలో విభిన్నంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు.
గని సినిమాను నేను చూశాను. ఎంతో బాగుంది. అన్ని సినిమాలు ఒకెత్తయితే, ఈ సినిమా మరో ఎత్తు. గని కోసం వరుణ్ చాలా కష్టపడ్డాడు. నీ కసి, నీ హార్డ్ వర్క్ కు మంచి ఫలితం వస్తుంది. హీరోయిన్ సయీ మంజ్రేకర్ కూడా అద్భుతంగా చేసింది. గని డైరెక్టర్ కిరణ్ కు తొలి చిత్రమే అయినా ఎంతో అనుభవం ఉన్నవాడిలా తీశాడు. తమన్ అందించిన సంగీతం సినిమాకు మరో ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఈ సినిమా భారీ విజయం అందుకుంటుందని నమ్ముతున్నాను.` అంటూ బన్నీ చెప్పుకొచ్చారు. ఈయన మాటలతో గని సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను వరుణ్ ఎంత వరకు రీచ్ అవుతాడో చూడాలి.