పొరుగుదేశం శ్రీలంకలో కొద్దిరోజులుగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు సెంట్రల్ బ్యాంక్ దగ్గరున్న విదేశీ మారక ద్రవ్య విలువలు పడిపోవడంతో విదేశీ మారక ధరలు పెరగడం, పర్యాటక రంగంతోపాటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచే ప్రధాన పరిశ్రమలు టీ, వస్త్రాల పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోవడంతో లంకలో అస్థిరత ఏర్పడింది. శ్రీలంకన్ కరెన్సీలో 230 రూపాయలుగా ఉన్న యూఎస్ డాలర్ విలువ 270కి పెరగడంతో వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి.
నిత్యావసర వస్తువుల ధరలన్నీ రెట్టింపుకాగా వంట గ్యాస్ కొరతతో చాలా హోటళ్లు మూతపడ్డాయి. నిత్యావసరాల కోసం, పెట్రోల్ బంకుల వద్ద జనం క్యూలలో బారులు తీరుతున్నారు. ఈ ఆర్ధిక సంక్షోభం నడుమ, శ్రీలంకలో తీవ్రమైన విద్యుత్ కోత…డీజిల్ కొరతతో జనరేటర్లు వాడలేని పరిస్థితితో జనం ఇక్కట్లు పడుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీలంకలో సంక్షోభం తీవ్ర రూపం దాల్చి అశాంతి ఏర్పడింది. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు.
శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకీ పెరిగిపోతుండడంతో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఎదురు కావడం, లంకలో ఆర్థిక సంక్షోభానికి గొటబాయ రాజపక్స కారణమంటూ నిరసనకారులు ఆందోళన దిగారు. నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో 10 మందికి గాయాలయ్యాయి. కొలంబోలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఇప్పటికే శ్రీలంక ప్రభుత్వం పశ్చిమ రాష్ట్రంలో 6 గంటల కర్ఫ్యూ విధించింది.
ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స శ్రీలంకలో ఏప్రిల్ 1 నుంచి అత్యవసర పరిస్థితిని విధించారు. దేశంలోని దారుణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల భద్రత, అత్యవసర సేవలు, నిత్యావసరాల సరఫరా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని రాజపక్స గెజిట్ జారీ చేశారు. రాజపక్స తన పదవినుంచి తప్పుకోవాలని దేశాధ్యక్ష భవనాన్ని వేలాదిమంది చుట్టుముట్టారు. ఈ క్రమంలోనే దేశంలోని పలుచోట్ల పలు హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు రాజపక్స ఎమర్జెన్సీ విధించారు.