సీఎం జగన్ పాలనలో ఐఏఎస్ లు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ కారణంతోనే ఇప్పటికే పలువురు ఐఏఎస్ లు అవమానకర రీతిలో కోర్టుల చేతిలో మొట్టికాయలు తినాల్సి వచ్చిందని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ పై మాజీ ఐఏఎస్ లు కొందరు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు.
కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ 8 మంది ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు శిక్ష విధించడంపై లక్ష్మీనారాయణ తనదైన రీతిలో స్పందించారు. ప్రతి అంశాన్ని అధికారులు ఫైళ్లలో రాస్తే కోర్టుకు వెళ్లే అవసరమే రాదని ఆయన అభిప్రాయపడ్డారు. మౌఖిక ఆదేశాలు జారీ చేసే సందర్భంలో అధికారులు వాటి పర్యవసనాలు కూడా ఆలోచించుకోవాలని లక్ష్మీనారాయణ హితవు పలికారు. పాఠశాల ఆవరణలో ఇతర భవనాలు వద్దని కోర్టు చెప్పినా భవన నిర్మాణాలు జరగడంతో కోర్టు ధిక్కరణగా పరిగణించిందని లక్ష్మీనారాయణ వివరించారు.
అయితే, ఉన్నతాధికారులు ఇలా శిక్షకు గురి కావడం వ్యవస్థకు మంచిది కాదని, ఆయా సంఘాలు కూర్చుని ఇటువంటి అంశాలపై చర్చించుకోవాలని సూచించారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పందించిన సంగతి తెలిసిందే. జగన్ వల్లే ఇలా అయిందని పరోక్షంగా ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన కామెంట్లు దుమారం రేపుతోన్నాయి. అంతేకాదు, జగన్ వ్యతిరేకంగా మాజీ ఐఏఎస్ లంతా గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.
జగన్ హయాంలో పనిచేస్తున్న ఐఏఎస్ లు ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలని, లేకుంటే ఐఏఎస్ ల వ్యవస్థకే చెడ్డపేరు వచ్చేలా ఉందని వారంతా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. ప్రభుత్వ పాలనలో ఐఏఎస్ లే కీలకమని…అలా అని అధికార పార్టీ నేతలు, సీఎం చెప్పినట్లు వింటే ఇలా కోర్టుల చుట్టు తిరిగి అవమానాల పాలు కావాల్సి వస్తుందని వారు భావిస్తున్నారట.