జగన్ మామ వచ్చాడు…అమ్మఒడితో పిల్లలకు ఫీజుల భారం లేకుండా చేశాడు…అంతేకాదు, బడిలో మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు తెచ్చాడు….ఫైవ్ స్టార్ చాక్లెట్ల రేంజ్ లో ఫల్లీ చిక్కీలతో పాటు రుచికరమైన వెరైటీ ఐటమ్స్ ను తన మేనల్లుళ్లు, మేనకోడళ్లకు అందిస్తున్నాడు అంటూ వైసీపీ నేతలు గొప్పలు చెబుతుంటారు. నిజంగా పిల్లలపై అంత ప్రేమ ఉన్న జగన్ మామ….రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నా….వాతావరణ శాఖ వడగాల్పుల హెచ్చరికలు జారీ చేస్తున్నా ఒంటిపూట బడులు పెట్టకపోవడంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఓ పక్క తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయని మార్చి 15 నుంచి ప్రతిరోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. అంతేకాదు, నేటి నుంచి రాబోయే వారం రోజులు..అంటే ఏప్రిల్ 6 వరకు వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశమున్న నేపథ్యంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్లలో ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకే బడులను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
కానీ, ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకూ నమోదవుతున్నా సరే ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఉదయం పది గంటలకే భానుడి భగభగల ధాటికి తట్టుకోలేక పెద్దవారే బయటకు అడుగుపెట్టేందుకు భయపడుతున్న తరుణంలో చిన్న పిల్లలను ఉదయం నుంచి సాయంత్రం వరకూ పాఠశాలల్లో కూర్చోబెడుతుండడంపై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో, బడికి రాబోమని చెప్పలేక…తప్పనిసరి పరిస్థితుల్లో హాజరవుతూ విద్యార్థులు, చిన్న పిల్లలు నానా అవస్థలు పడుతున్నారని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు.
మామూలుగా అయితే, ప్రతి ఏటా మార్చి15 నుంచి ఒంటిపూట బడులు పెట్టడం ఆనవాయితీ. ఉష్ణోగ్రతల్లో పెరుగుదలను బట్టి దశాబ్దాల నుంచి ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. అయితే, కరోనా కాలంలో క్లాసులు మిస్సయ్యాయని, కాబట్టి ఈసారి కొంచెం లేటుగా ఒంటిపూట బడులు పెడతారని కొందరు అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. అయితే, ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి విద్యార్థులు అనారోగ్యం పాలయితే…అది వారికి ప్రమాదకరం కాదా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది క్లాసులు ఎక్కువే జరిగాయని అంటున్నారు.
మార్చి 15 దాటి 15 రోజులవుతున్నా, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా విద్యాశాఖ ఒంటిపూట బడులమాటే ఎత్తడం లేదని, తీవ్రమైన ఎండలకు చాలామంది విద్యార్థులకు ముక్కులు, కళ్లల్లో మంట వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇప్పటికైనా ఒంటిపూట బడులు పెట్టకుంటే పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి తీవ్రత విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోందని, వెంటనే ఒంటిపూట బడులను నిర్వహించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సాయి శ్రీనివాస్, తిమ్మన్న, ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. మరి, ఈ వ్యవహారంపై జగన్ మామ ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.