‘కొద్దిసేపటి క్రితం భారత రాష్ట్రపతి అభ్యర్థిగా శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని ఎన్నిక చేసినట్లు తెలుస్తోంది. తెలుగు వారైన వెంకయ్య నాయుడు ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా భారత రెండో అత్యున్నత పదవిలో కొనసాగుతున్నారు. దేశ అత్యున్నత పదవికి ఒక మెట్టు దూరంలో ఉన్న వెంకయ్యనాయుడు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది’ బ్రేకింగ్ న్యూస్ అంటూ ఈ పోస్ట్ ఈ రోజు ఉదయం నుంచి వాట్సాప్, ఫేస్ బుక్ సహా అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది.
దీంతో, మన తెలుగురాష్ట్రానికి చెందిన వ్యక్తి రాష్ట్రపతి కాబోతున్నారని చూడగానే సహజంగానే తెలుగు వాళ్లంతా ఆ మాత్రం ఉత్సాహం చూపించడం..చిటికెలో దానిని వైరల్ చేయడం కామన్. అందులోనూ, మరో 4 నెలల్లో భారత రాష్ట్రపతి పదవీకాలం ముగియబోతుండడంతో బీజేపీకి వీర విధేయుడిగా ఉన్న వెంకయ్య నాయుడు భారత ప్రథమ పౌరుడు కాబోతున్నారన్న వార్త కాస్త నమ్మశక్యంగానే ఉంది. అయితే, ఇంత నమ్మశక్యంగా ఉన్నప్పటికీ..ఆ వార్త అధికారికంగా విడుదల కానంతవరకు అది పుకారు కిందకే వస్తుంది. ఇక, ఆ పుకారును అధికారికంగా ఖండిస్తే అది కచ్చితంగా ప్రస్తుతానికి పుకారుగానే మిగిలిపోతుంది. తాజాగా వెంకయ్యనాయుడు-రాష్ట్రపతి వ్యవహారంలోనూ అదే జరిగింది.
ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ముగియడానికి మరో నాలుగు నెలల గడువుంది. ఎన్నికల ప్రక్రియ మొదలు కావడానికి కూడా మరో 3 నెలల సమయముంది. అలాగే వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగియడానికి కూడా మరో ఐదు నెలల సమయం ఉంది.
ఈ సమయంలో కాబోయే రాష్ట్రపతి ఎవరన్న దానిపై రకరకాల ఊహాగానాలు రావడం..పలు పేర్లు తెరపైకి రావడం సహజం. ఆ కోవలోనే వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కాబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
అయితే, ఈ వ్యవహారంపై ఉపరాష్ట్రపతి కార్యాలయం అధికారులను మీడియా ప్రతినిధులు సంప్రదించారు. దీంతో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు అబద్ధమని తొలుత అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఆ తర్వాత కొద్ది సేపటికే ఉప రాష్ట్రపతి కార్యాలయం నుంచి అధికారికంగా ఆ పుకార్లు అవాస్తవమని, వాటిని నమ్మవద్దని ప్రకటన వెలువడింది. ఆ వదంతులను ఖండించిన ఉపరాష్ట్రపతి కార్యాలయం….ఇప్పటివరకు అలాంటి సమాచారమేదీ లేదని, దయచేసి ఊహాగానాలు వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేసింది.
అయితే, ఈ పుకారు నిజం కావడానికి 100 కు 99 శాతం అవకాశాలున్న మాట అతిశయోక్తి కాదు. ఎందుకంటే, రాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడు అన్ని విధాలా అర్హులు. బీజేపీ దక్షిణాది రథ సారథుల్లో కీలక నేతగా పేరున్న వెంకయ్య నాయుడు ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి చెప్పిన నేపథ్యంలో…పార్టీకి ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తున్న ఆయనను రాష్ట్రపతి పదవినిచ్చి గౌరవించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఒకవేళ ఉప రాష్ట్రపతి కార్యాలయంలోని ఏదో ఒక కోయిల తొందరపడి ముందే కూయడంతో…ఆ వార్త బయటకు వచ్చి ఉండే అవకాశమూ లేకపోలేదు. దీంతో, హుటాహుటిన దానిని ఖండించాల్సిన పరిస్థితి వచ్చి ఉండవచ్చు. ఏది ఏమైనా ఒక తెలుగు వారమైన మనమంతా తెలుగు జాతి గర్వించే నేతగా ఎదిగిన వెంకయ్యనాయుడు…మరో మెట్టు ఎక్కి రాష్ట్రపతి పదవిని అలంకరించాలని ఆశిద్దాం.