ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని హైకోర్టులో పిటిషన్ దాఖలైన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని, ఆ భూమిలో ఉన్న శివాలయంతోపాటు 16 మందిని నిందితులుగా పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసుకు సంబంధించి విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, తహసీల్దార్ కార్యాలయాన్ని కోర్టు ఆదేశించింది. దీంతో, శివాలయంలోని పరమ శివుడితోపాటు మొత్తం 10 మందికి సమన్లు జారీ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ క్రమంలోనే తాజాగా ఆ భూ ఆక్రమణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమశివుడు విచారణకు హాజరు కావడం మరింత వైరల్ అయింది. సదరు శివాలయంలోని శివలింగాన్ని రిక్షాలో తీసుకొచ్చి హాజరుపరిచిన ఘటన దేశవ్యాప్తంగా వైరల్ అయింది. మీరు విన్నది నిజమే. ఇదేదే గోపాల గోపాల తరహా సినిమాలోని కోర్టు సీన్ కాదు. వినేందుకు విడ్డూరంగా ఉన్నా…నమ్మశక్యంగా లేకపోయినా…ఆ సమన్లు అందుకున్న పరమశివుడు (విగ్రహం) విచారణకు తహశీల్దార్ ఆఫీసుకు హాజరైంది. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 9 మంది కూడా విచారణకు హాజరయ్యారు.
అయితే, కథ ఇంతటితో ముగియలేదు. ఏప్రిల్ 13న శివుడు మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని సంబంధిత తహశీల్దార్ చెప్పారు. ప్రిసైడింగ్ అధికారులు ఇతర ప్రభుత్వ పనుల్లో బిజీగా ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అయితే, ఈ వ్యవహారంలోకి పరమ శివుడిని లాగడంపై భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఆ ఆలయ ధర్మకర్త, మేనేజర్, పూజారిలలో ఎవరో ఒకరికి సమన్లు ఇవ్వవచ్చని, కానీ, నేరుగా శివుడికి జారీ చేయడం విడ్డూరం అని భక్తులు మండిపడుతున్నారు. ఏది ఏమైనా…కలికాలం అంటే ఇదేనని, అందుకే ఇలాంటి వింతపోకడలకు పోతున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.