ఏపీ సీఎస్ సమీర్ శర్మకు ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. తన సస్పెన్షన్ కాలం ముగిసినందున తనకు రూల్స్ ప్రకారం పూర్తి జీతం తక్షణమే చెల్లించాలని కోరారు. ప్రస్తుతం డీజీపీ హోదాలో ఉన్న తన సస్పెన్షన్లో కొనసాగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఏబీ తేల్చి చెప్పారు. రెండేళ్లు పూర్తయినందున సస్పెన్షన్ తొలగిపోయినట్లేనని లేఖలో పేర్కొన్నారు.
తనపై సస్పెన్షన్ను ఆరేసి నెలల చొప్పున ఏపీ సర్కార్ పొడిగిస్తూ వచ్చిందని, ఆ లెక్కన మొత్తం రెండేళ్ల సస్పెన్షన్ గడువు జనవరి 27కే ముగిసిందని చెప్పారు. రెండేళ్లకు మించి సస్పెన్షన్ విధించాలంటే కేంద్ర హోం శాఖ అనుమతి తప్పనిసరి అని, ఈ కారణంతో తనపై సస్పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం ఇక కొనసాగించలేదని వెల్లడించారు. గడువు ముగిసినందున రూల్ ప్రకారం సస్పెన్షన్ ఆటోమేటిక్గా తొలగిపోయినట్టేనని అన్నారు.
తన సస్పెన్షన్ పై గడువులోగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అనుమతి తీసుకోలేదని, 31.7.2021న చివరిసారిగా తన సస్పెన్షన్ను పొడిగిస్తూ ఇచ్చిన జీవోను ఏపీ ప్రభుత్వం రహస్యంగా ఉంచిందని ఆరోపించారు. తనకు ఆ కాపీ కూడా ఇవ్వలేదని లేఖలో రాశారు. కాగా, ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలని గత ఆగస్టులో కేంద్రానికి జగన్ సర్కార్ సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.
నిఘా పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో పాటు కొందరు అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడి సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వం అభియోగాలు మోపింది. అయితే, ఈ వ్యవహారం సుప్రీం కోర్టుతో పాటు, కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. ఏపీ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం ఏబీపై సస్పెన్షన్ విధించిన కేంద్రం…ఆయనపై చర్యల వ్యవహారంలో తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. తాజాగా ఏబీ లేఖపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.