టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న తారక్, చరణ్ ఫ్యాన్స్…థియేటర్ల దగ్గర ఓ రేంజ్ లో రచ్చ చేశారు. అయితే, ఆర్ఆర్ఆర్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్భంగా సంబరాలు చేసుకునే ఘటనలతో పాటు కొన్ని విషాద ఘటనలు, అపశృతులూ జరిగాయి.
అనంతపురంలో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శిస్తుండగా అంబేద్కర్ నగర్ కు చెందిన ఓబులేసు అనే వ్యక్తి ప్రాణాలు వదిలాడు. 30 ఏళ్ల ఓబులేసు థియేటర్లో గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లేసరికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. గతంలో గుండె సంబంధిత ఇబ్బందులున్న ఓబులేసుకు స్టంట్ కూడా వేశారని స్నేహితులు తెలిపారు. సినిమా చూస్తూ ఎమోషన్‌కు గురై గుండె పోటు వచ్చి ఉంటుందని స్నేహితులు, కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలోని వి.కోటకు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు చనిపోయారు. వీరంతా RRR విడుదల సందర్భంగా థియేటర్ దగ్గర భారీ కటౌట్లు కట్టి ఇంటికి వెళ్తుండగా గత అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
ఇక, తూర్పు గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి థియేటర్లో తుపాకీతో హల్ చల్ రేపడంతో థియేటర్ కు వచ్చిన జనం ఒక్కసారిగా భయపడిపోయారు. గన్‌తో ఫొటోలకు ఫోజులిస్తూ ఆ వ్యక్తి స్థానికులను భయాందోళనలకు గురి చేశాడు. స్క్రీన్ ముందు గన్‌తో కేరింతలు కొడుతూ రచ్చ చేశాడు. ఆ తర్వాత గన్‌తో తిరుగుతున్న అతడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అది డమ్మీ గన్ అని, సినిమాలపై ఉన్న ఇష్టంతో థియేటర్లో అలా గన్‌తో ఫోటోలకు ఫోజులిచ్చాడని పోలీసులు గుర్తించారు.
విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్లో సాంకేతిక కారణాలతో ఆర్ఆర్ఆర్ సినిమా నిలిచిపోవడంతో ఫ్యాన్స్ నానా రచ్చ చేశారు. థియేటర్ తెర చించేసి, అద్దాలు ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితులను అదుపులోకి తేవాల్సి వచ్చింది. ఆ తర్వాత స్క్రీన్ రిపేర్ చేసి సినిమాను ప్రదర్శించారు. అయితే, ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు నాలుగు రోజుల ముందే ఇదే అన్నపూర్ణా థియేటర్లో ముందు జాగ్రత్తగా తెర వద్ద మేకులు కొట్టిన చెక్కలను అమర్చిన విషయం వైరల్ అయిన సంగతి తెలిసిందే. స్క్రీన్ దగ్గరకు వస్తే అపాయం అని హెచ్చరిక బోర్టులూ పెట్టారు. అయినప్పటికీ…ఈ థియేటర్లో తెరను ఫ్యాన్స్ చింపేయడం హాట్ టాపిక్ గా మారింది.