పింక్ డైమండ్ కనిపించకుండా పోయింది అంటూ నడుస్తున్న వివాదానికి ఇక తెరపడినట్టేనా? ఈ విషయం లో జోక్యం చేసుకునేందుకు తాము సిద్ధంగా లేమన్న హైకోర్టు తీర్పుతో ఈ డైమండ్ ఏమైందన్న వివాదం ఇక ముగిసినట్టేనా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు.
ముఖ్యంగా 2018లో చంద్రబాబు హయాంలో ఈ వివాదం రాజకీయ రంగు ములుపుకొంది. పింక్ డైమండ్ విషయంలో రాజుకున్న వివాదం వ్యక్తిగత వివాదాలవరకు వెళ్లింది. దీనిపై విచారణ జరి పించాలని అనేక డిమాండ్లు వచ్చాయి. ఇక, అప్పట్లో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వైసీపీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఏకంగా ఈ డైమండ్‌ను చంద్రబాబు ఇంట్లో వెతికితే దొరుకుతుందని సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
టీడీపీ ప్రధాన అధ్యక్షుడుగా పనిచేసి రిటైర్ అయిన రమణ దీక్షితులు కూడా దీనిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనీవాకు తరలించేశారని.. అక్కడ ఈ పింక్ డైమండ్‌ను వేలం కూడా వేసేశారని చెబుతూ.. ఆయన కొన్ని వార్తలను కూడా ఉటంకించడం గమనార్హం. అంతేకాదు, దాదాపు 37 కోట్ల రూపాయలు విలువ చేస్తుందని భావిస్తున్న పింక్ డైమండ్ వివరాలు.. శ్రీవారి ఆభరాణాల జాబితాలో కనిపించడంలేదని.. ఉద్దేశ పూర్వకంగా దీనిని దారిమళ్లించారని.. రమణదీక్షితు లు వ్యాఖ్యానించారు. దీంతో అప్పట్లోనే ఈ వివాదం సుప్రీంకోర్టుకు ఎక్కింది.
ఈ క్రమంలో సుప్రీం కోర్టు రెండు కమిటీలను వేసింది. ఈ రెండు కమిటీలు కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేశాయి. దీనిపై నివేదికలు ఇచ్చాయి. వీటిలో ఒక నివేదికలో.. అసలు పింక్ డైమండ్ అనేది శ్రీవారి ఆభరణాల్లో లేనేలేదని.. అది కేవలం రూబీ మాత్రమేనని.. పేర్కొనడం గమనార్హం. అయితే.. అది కూడా గరుడోత్సవం సందర్భంలో మహారాష్ట్రకు చెందిన కొందరు భక్తులు మూకుమ్మడిగా శ్రీవారి ఉత్సవవిగ్రహంపై నాణేలు విసరడంతో ముక్కలైందని.. ఇప్పుడు ఆ ముక్కలు శ్రీవారి ఆభరణాల జాబితాలో భద్రంగానే ఉందని రిపోర్టు పేర్కొంది.
ఇక, అటు సాయిరెడ్డి.. ఇటు రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలపై టీటీడీ.. సుప్రీంకోర్టులో పరువు నష్టం కేసు కూడా దాఖలు చేసింది. దాదాపు ఈ కేసు విచారణ, ఫైలింగ్ కోసం రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది. ఇంతలోనే ప్రభుత్వం మారిపోయింది. వైసీపీ సర్కారు కొలువుదీరగానే.. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడం గమనార్హం.
ఇక, సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీలు పింక్ డైమండ్‌పై నివేదికలుఇచ్చినా.. ఇప్పటి వరకు కోర్టు తీర్పు ఇవ్వకపోవడం గమనార్హం. అసలు ఉందో లేదో కూడా చెప్పడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి.. టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
పింక్ డైమండ్ ఏమైంది? ఎక్కడ ఉంది? అంశాలను తేల్చాలని కోరారు. అంతేకాదు, దీనిపై వ్యాఖ్యాలు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి, రమణ దీక్షితులు, మాజీ ఈవోలు ఐవైఆర్ కృష్ణారావు, ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు.
దీనిపైనే విచారణ జరిపిన హైకోర్టు ఇప్పటికే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన రెండు కమిటీలు విచారణ జరిపాయని, నివేదికలు కూడా అందించాయని పేర్కొంది. ఇక, పింక్ డైమండ్‌పై విచారణ జరిపించాల్సిన అవసరం లేదని హైకోర్టు చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఇక పింక్ డైమండ్ కథ తో వైకాపాకి రాజకీయాలు చేసే అవకాశం లేకుండా పోయింది.