మహేంద్ర సింగ్ ధోనీ…టీమిండియా కెప్టెన్ గా, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ రథసారధిగా ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన మేటి కెప్టెన్. మిస్టర్ కూల్ గా పాపులర్ అయిన ధోనీ…మైదానం లోపలే కాదు…మైదానం వెలుపల కూడా చాలా కూల్ గా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే అంతే కూల్ గా తాజాగా ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్-2022 ఆరంభానికి రెండు రోజుల ముందు సీఎస్కే కెప్టెన్సీకి గుడ్ బై చెబుతున్నానని ప్రకటించి అందరికీ షాకిచ్చాడు.
డ్యాషింగ్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు జట్టు పగ్గాలను ధోనీ ఈ రోజు అందించాడు. ఈ ఐపీఎల్ సీజన్ తో పాటు భవిష్యత్తులోనూ సీఎస్కే జట్టు సభ్యుడిగా ధోనీ కొనసాగుతాడని సీఎస్కే యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. 2008 నుంచి సీఎస్కేకు జట్టుకు ధోనీ కెప్టెన్ గా ఉన్నాడు.
ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకుంది. 2010, 2011, 2018, 2021 సీజన్లలో జట్టుకు టైటిల్ అందించడంలో ధోనీ కీలక పాత్ర పోషించాడు. ధోనీ సారథ్యంలో 212 మ్యాచ్ లు ఆడిన సీఎస్కే 204 సార్లు విజయం సాధించడం విశేషం.
తాజాగా ధోనీ తీసుకున్న నిర్ణయంతో అతడి అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. కనీసం ఐపీఎల్ లో అయినా ధోనీ మార్క్ కెప్టెన్సీ చూద్దామనుకుంటే నిరాశే ఎదురైందని అభిప్రాయపడుతున్నారు. సీఎస్కేతో ధోనికి ఉన్న అనుబంధం నేపథ్యంలో ఈ సీజన్ కు ముందు కెప్టెన్ గా తప్పుకోవడంతో అభిమానులు షాకయ్యారు. మార్చి 26న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆరంభ మ్యాచ్‌కు ముందు తలా ధోనీ ఇలా అనూహ్య నిర్ణయం తీసుకోవడం తమిళ తంబీలకు మింగుడుపడడం లేదు.