న్యాయవ్యవస్థలపై, న్యాయమూర్తులపై ఏపీ సీఎం జగన్ కు, వైసీపీ నేతలకు ఏ మాత్రం గౌరవముందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రస్తుత సీజీఐ ఎన్వీ రమణపై జగన్ రాసిన లేఖ, కోర్టులపై జగన్ చేసిన కామెంట్లు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా పలు విషయాల్లో ఏపీ సర్కార్ కు, జగన్ కు కోర్టు పలుమార్లు మొట్టికాయలు వేసింది. అయినా సరే…తగ్గేదేలే అన్న రీతిలో తాజాగా కోర్టులపై జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి రాజధాని అని ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నేడు అసెంబ్లీలో చర్చ సందర్భంగా జగన్ మరోసారి కోర్టులపై షాకింగ్ కామెంట్లు చేశారు.
రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకే ఉందని, చట్టాలను కోర్టులు చేస్తాయా? అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. చట్టాలు చేసేందుకే ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, శాసన వ్యవస్థ ఓ చట్టాన్ని చేయాలా? వద్దా? అని కోర్టులు నిర్ణయించలేవని తేల్చి చెప్పారు.
సుప్రీం కోర్టు ఆదేశాలున్నప్పటికీ ఆచరణ సాధ్యం కాని తీర్పును ఇటీవల అమరావతిపై హైకోర్టు ఇచ్చిందని జగన్ విమర్శించారు. హైకోర్టుపై గౌరవం ఉందంటూనే న్యాయవ్యవస్థను జగన్ మరోసారి అవమానించారు. రాష్ట్ర అసెంబ్లీ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమకుందని, హైకోర్టు తీర్పుపై ఇవాళ చర్చ జరగకపోతే చట్టాలు చేయాల్సింది శాసన సభా? లేదా కోర్టులా? అన్నది ప్రశ్నార్థకంగా మారుతుందని జగన్ అన్నారు.
నెలరోజుల్లో లక్ష కోట్ల రూపాయలతో రాజధాని కట్టాల్సిందేనని కోర్టులు ఎలా డిక్టేట్ చేస్తాయని జగన్ ప్రశ్నించారు. అన్ని వ్యవస్థలు వాటి పరిధిలో ఉండాలని, లేకుంటే సిస్టమ్ మొత్తం కుప్పకూలిపోతుందని చెప్పారు. గుంటూరు, విజయవాడ కాకుండా..తమ బినామీలకు భూములున్న చోట టీడీపీ నేతలు రాజధాని పెట్టారని ఆరోపించారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించి వైసీపీకి ఘన విజయం కట్టబెట్టారని, వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని శివరామకృష్ణ కమిటీ కూడా తేల్చి చెప్పిందని అన్నారు.
న్యాయవ్యవస్థ మీద అచంచల గౌరవం, విశ్వాసం ఉందని, అలాగే అందరికీ మంచి చేయడమే ప్రభుత్వం ముందున్న మార్గం అని అన్నారు. మూడు రాజధానులకే తాము కట్టుబడి ఉన్నామని, న్యాయ సలహాలు తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చలు జరుపుతున్నామని చెప్పారు. రాజధానిపై రాష్ట్రానిదే తుది నిర్ణయమని కేంద్రం అఫిడవిట్ కూడా ఫైల్ చేసిందని, హైకోర్టు ఎక్కడుంటే అక్కడే రాజధాని ఉండాల్సిన అవసరం కూడా లేదని కేంద్రం చెప్పిందని అన్నారు.