తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక బీజేపీకి మంచి కిక్కిచ్చిన సంగతి తెలిసిందే. ఆ గెలుపు తర్వాత తెలంగాణలో ముఖ్యంగా భాగ్యనగరంలో బీజేపీ దూకుడు పెంచింది. దుబ్బాక విజయం తర్వాత వచ్చిన జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ లు మరింత దూకుడు పెంచారు. ఆ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పై ధర్మపురి అరవింద్ సంచలన స్థాయిలో విమర్శలు గుప్పించారు.
2020లో కేబీఆర్ పార్క్ వద్ద టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్ లను అరవింద్, ఆయన అనుచరులు తొలగించడంతోపాటు కేసీఆర్, కేటీఆర్ లను అరవింద్ దుర్భాషలాడారని కేసు నమోదైంది. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ హోదాలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఈ కేసును ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేశారు.
దీంతో, విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని కోర్టు పలుమార్లు ఆదేశించింది. కానీ, అరవింద్ ఒక్కసారి కూడా కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతో తాజాగా ఈ వ్యవహారంపై కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంపీ అరవింద్ కు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 28కి వాయిదా వేసింది. మరి, ఈ వ్యవహారంపై అరవింద్ తోపాటు బీజేపీ నేతల రియాక్షన్ ఏమిటన్నది వేచి చూడాలి.