జంగారెడ్డి గూడెం కల్తీ సారా మరణాల నేపథ్యంలో అధికార పార్టీపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో జగన్ వచ్చిన తర్వాత జే బ్రాండ్ తో కల్తీ మద్యం, నాటు సారా ఏరులై పారుతోందని టీడీపీ నేతలు దుయ్యబడుతున్నారు. దీంతో, చంద్రబాబు హయాంలోనే డిస్టిలరీస్ కు పర్మిషన్ ఇచ్చారని, రాష్ట్రంలో ఉన్నది సీ బ్రాండ్లేనని జగన్ అవాస్తవాలను అసెంబ్లీ సాక్షిగా ప్రచారం చేశారు.
ఈ క్రమంలోనే సీఎం జగన్ పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఉన్నది ‘సి’ బ్రాండేనన్న జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ చెప్పిన ‘సి’ బ్రాండ్ ఉందని, అదే చంద్రబాబు నాయుడు బ్రాండ్ అని అచ్చెన్న చెప్పారు. అంతేకాదు, తెలుగు జాతి ఉన్నంత వరకు ‘సి’ బ్రాండ్ ఉంటుందని గర్వంగా చెప్పారు. ఆ సీ బ్రాండ్ జగన్ లాగా చీప్ లిక్కరు బ్రాండ్ కాదని తేల్చి చెప్పారు.
హైదరాబాద్ నగరం విస్తరించడానికి చంద్రబాబు సీ బ్రాండే కారణమని ప్రశంసించారు. ఏపీలో ఇన్ని పరిశ్రమలు వచ్చాయనంటే అది సీ బ్రాండ్ చలవేనని, ప్రపంచానికి ఏపీ బ్రాండ్ ను చాటిచెప్పిన ఘనత సీ బ్రాండ్ దేనని జగన్ కు చురకలంటించారు. మద్యంపై ఏటా రూ.10 వేల కోట్ల ఆదాయమే జగన్ టార్గెట్ అని, అందుకే గాంధీ జయంతి రోజే కొత్త మద్యం పాలసీ తెచ్చారని ఆరోపించారు.
మద్యం దుకాణాలు, కంపెనీలన్నీ తన చేతుల్లోకి, వైసీపీ నేతలకు రావాలన్న ఉద్దేశంతో మద్యం పాలసీని మార్చారని మండిపడ్డారు. మద్యపాన నిషేధం పేరుతో సీఎం అయిన జగన్…ఆదాయం ఆ మద్యాన్నే నమ్ముకోవడం దారుణమని ఫైర్ అయ్యారు. జగన్ తో పోరాడడం తేలిక కాదని, జనం కోసం తాము ప్రాణాలకు తెగించి మద్యంపై పోరాడుతున్నామని చెప్పారు.
మద్యంపై ఆదాయంలో తాడేపల్లికి నెలనెలా రూ.200 కోట్లు వస్తున్నాయన్నందుకు ఆధారాలున్నాయని ఆరోపించారు. వృద్ధుల పింఛన్ల కోసం మద్యం ఆదాయాన్ని నమ్ముకుంటున్నారని, తల్లికీ, తండ్రికీ పింఛను ఇచ్చేందుకు కొడుకును చంపుతావా అంటూ నిలదీశారు. మరి, అచ్చెన్న కామెంట్లపై జగన్ రియాక్షన్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.