కొన్నేళ్ల ముందు వరకు అల్లు అర్జున్ టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడు మాత్రమే. అతణ్ని టాప్ లీగ్ హీరోల్లో ఒకడిగా కూడా చూసేవారు కాదు. కలెక్షన్ల పరంగా రికార్డులు, ఇండస్ట్రీ హిట్లు లాంటి మాటలు అతడి సినిమాల విషయంలో వినిపించేవే కావు. కానీ చూస్తుండగానే ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు అభిమానులు, కుటుంబ సభ్యులు బన్నీ అని ముద్దుగా పిలుచుకునే అల్లు అర్జున్.
ఇప్పుడు ఇండియాలోనే టాప్ స్టార్లలో అతనొకడైపోయాడు. రికార్డుల మోత మోగిస్తున్నాడు. మార్కెట్‌ను అనూహ్య స్థాయిలో విస్తరించాడు. ‘పుష్ప’ సినిమాతో అతను ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన తీరుకు అందరూ విస్మయానికి గురయ్యారు. ఇప్పుడతను పాన్ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్. ఈ ఘనత దర్శక ధీరుడు రాజమౌళి సపోర్ట్ లేకుండానే సాధించడం బన్నీని అందరు స్టార్లలోకి ప్రత్యేకంగా నిలబెడుతోంది.
గత నెల రోజులుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చర్చలన్నీ ‘పుష్ప’ సినిమా చుట్టూనే తిరుగుతున్నాయి. అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈ చిత్రంలో పుష్పగా బన్నీ పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
తనకు ఏమాత్రం అవగాహన లేని చిత్తూరు యాసను నేర్చుకుని అక్కడి లోకల్ జనాల మాదిరి డైలాగులు చాలా చక్కగా చెప్పడమే కాదు.. డీగ్లామరస్, రగ్డ్ లుక్‌తో ఆ పాత్రను పండించిన విధానానికి అందరూ ఫిదా అయిపోయారు. ఇలాంటి పాత్రలు మామూలుగా తమిళ చిత్రాల్లోనే చూస్తాం.
మన స్టార్ హీరోలు కొంచెం డీగ్లామరస్ రోల్ అంటేనే ఆలోచిస్తారు. అలాంటిది పుష్ప తరహా పాత్ర అంటే అంతే సంగతులు. ఎర్రచందనం దుంగలు కొట్టే కూలివాడిగా.. ఆద్యంతం మాసిన బట్టలతో, గుబురు గడ్డం, జుట్టుతో కనిపిస్తూ కాస్త గూని కూడా ఉన్నవాడిలా నటించి మెప్పించడం.. ఆ పాత్రలో హీరోయిజాన్ని పండించడం అంటే ఆషామాషీ విషయం కాదు.
ఈ విషయంలో బన్నీ పడ్డ కష్టం.. అతను చూపించిన కమిట్మెంట్ను ఎంత పొగిడినా తక్కువే. ఈ పాత్రతో అతను దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులనూ మెస్మరైజ్ చేశాడు. ముఖ్యంగా హిందీలో, తమిళంలో ఈ చిత్రం ఇరగడేసి అక్కడి ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యానికి గురి చేసింది. హిందీలో అసలేమాత్రం అంచనాలు, ప్రమోషన్లు కూడా లేకుండా మామూలుగా రిలీజైన ఈ చిత్రం రూ.85 కోట్ల మేర గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది.
ఇక తెలుగు సినిమాలను పెద్దగా పట్టించుకోని తమిళ ప్రేక్షకులు ఈ సినిమాకు రూ.25 కోట్లకు పైగానే గ్రాస్ వసూళ్లు అందించారు. కేరళలో ఎలాగూ బన్నీకి ముందు నుంచి మంచి ఫాలోయింగే ఉంది. అక్కడా ఈ సినిమా బాగా ఆడింది. కర్ణాటకలోనూ భారీ వసూళ్లే సాధించింది. తెలుగు రాష్ట్రాల సంగతి చెప్పాల్సిన పని లేదు.
ఏపీలో టికెట్ల రేట్లు తక్కువుండటం వల్ల వసూళ్లు తగ్గాయే తప్ప ఆదరణకు ఢోకా లేదు. మొత్తంగా ఈ చిత్రం రూ.300 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి ఈ సినిమాకు అంత మంచి టాక్ ఏమీ రాలేదు. డివైడ్ టాక్‌తోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం బన్నీ బాక్సాఫీస్ స్టామినాకు, సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం.
సుక్కు మాటలే రుజువు
‘పుష్ప’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారంటే నవ్వుకున్న వాళ్లే ఎక్కువ. బయటి జనాల సంగతి ఎందుకు.. అసలు ఈ చిత్ర దర్శకుడు సుకుమార్‌కే ఈ విషయం కామెడీగా అనిపించిందట. ‘పుష్ప’ సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. ‘పుష్ప’ను తాను తెలుగు సినిమాగా మాత్రమే చూశానని చెప్పాడాయన.
మహా అయితే మలయాళంలో అల్లు అర్జున్‌కున్న ఫాలోయింగ్ వల్ల ఆడొచ్చేమో కానీ.. వేరే భాషల్లో ఈ సినిమా ప్రభావం చూపుతుందన్న ఆశలేమీ లేవట ఆయనకి. నేపాల్‌కు ప్రింట్లు పంపించాలి.. బీహార్ సంగతేంటి నిర్మాతలు మాట్లాడుకుంటుంటే లోలోన నవ్వుకున్నానని, వీళ్లకేమైనా పిచ్చా అనుకున్నానని.. కానీ తాను అల్లు అర్జున్ను తక్కువ అంచనా వేశానని తర్వాత అర్థమైందని.. ‘పుష్ప’ హిందీలో ఇంత బాగా ఆడుతుండటం తనకు ఆశ్చర్యం కలిగించిందని, తమిళంలోనూ వస్తున్న వసూళ్లు తనకు షాకింగ్ అని చెప్పాడు సుకుమార్.
విడుదలకు ముందు అంతా పేరుకే ఇది పాన్ ఇండియా రిలీజ్ అవుతోందని.. ఉత్తరాదిన, తమిళనాడులో ఈ సినిమాను పెద్దగా పట్టించుకోకపోవచ్చని అనుకున్నారు. అందులోనూ రిలీజ్ ముంగిట బాగా హడావుడి అవడం, పోస్ట్ ప్రొడక్షన్ సరిగా చేయకపోవడం.. ప్రమోషన్లు లేకపోవడంతో ‘పుష్ప’ వేరే భాషల్లో ‘పుష్ప’ ప్రభావం మీద మరింత సందేహాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా హిందీ, తమిళం, మలయాళ భాషల్లో సాధించిన వసూళ్లు చూసి ఇప్పుడు అందరూ విస్తుబోతున్నారు.
యూట్యూబ్‌లో, హిందీ ఛానెళ్లలో రిలీజైన తన డబ్బింగ్ సినిమాల ద్వారా బన్నీ అక్కడి మాస్ జనాల్లోకి బాగా దూసుకెళ్లిపోయాడని ‘పుష్ప’తో రుజువైంది. ఈ సినిమా వివిధ భాషల్లో బ్లాక్‌బస్టర్ స్టేటస్ అందుకుంది. దీంతో ఆటోమేటిగ్గా ‘పుష్ప-2’పై అంచనాలు, అలాగే బిజినెస్ పెరిగిపోతాయనడంలో సందేహం లేదు.
‘పుష్ప’ ఫస్ట్ పార్ట్‌కు ‘పుష్ప: ది రైజ్’ అని టైటి్ల్ పెట్టారు. ఇప్పుడు ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో బన్నీ: ది రైజ్ చూశాం. ‘పుష్ప’ సెకండ్ పార్ట్‌కు ‘పుష్ప: ది రూల్’ అన్నది టైటిల్. అప్పుడు ‘బన్నీ: ది రూల్’ చూడబోతున్నట్లే. ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా కొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయం. నాన్-బాహుబలి, రాజమౌళి, ప్రభాస్ సినిమాల రికార్డులన్నింటినీ ఇది బద్దలు కొట్టేస్తుందేమో.
అందుకే స్పెషల్
మామూలుగా బాలీవుడ్ స్టార్లకు మార్కెట్ పరిధి ఎక్కువ. హిందీ సినిమాలు దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో విడుదలవడమే అందుక్కారణం. సౌత్ హీరోలు వాళ్లతో పోలిస్తే చాలా వెనుకబడే ఉండేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు మారాయి. సౌత్ సినిమాల రేంజ్ పెరిగింది. మార్కెట్లు విస్తరించాయి.
ముఖ్యంగా రాజమౌళి సినిమాలతో హీరోల కెరీర్లే మారిపోతున్నాయి. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిపోయాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సైతం పాన్ ఇండియా లెవెల్లో పెద్ద స్టార్లుగా అవతరిస్తారని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత జక్కన్నతో సినిమా చేయబోతున్న మహేష్ బాబు ఇమేజ్, రేంజ్ కూడా మారిపోవడం ఖాయం.
ఇలా మార్కెట్ విస్తరించుకుని, స్టార్ ఇమేజ్ పెంచుకోవడానికి జక్కన్నతో ఓ సినిమా చేయాలని అందరు స్టార్లకూ ఉంది. బన్నీ కూడా అందుకు మినహాయింపు కాకపోవచ్చు. కానీ జక్కన్నతో జట్టు కట్టడానికి ముందే ‘పుష్ప’ మూవీతో ఎవ్వరూ ఊహించని విధంగా అతను పాన్ ఇండియా స్థాయిలో స్టార్ అయిపోవడం విశేషం. ఒక ప్రాంతీయ భాషా కథానాయకుడు పాన్ ఇండియా స్టార్ కావాలంటే రాజమౌళి సపోర్ట్ తప్పనిసరి అన్న అభిప్రాయం బలంగా ఉన్న టైంలో బన్నీ.. ఆ అవసరం లేకుండానే ఈ ఇమేజ్ సంపాదించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
ఆల్రెడీ బన్నీకి మలయాళంలో మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు ‘పుష్ప’ మూవీతో ఉత్తరాదిన అతడికి ఊహించని స్థాయిలో మార్కెట్ ఏర్పడింది. తమిళనాట కూడా అతను ప్రభావం చూపించాడు. అక్కడ కూడా బేస్ వచ్చినట్లే. ‘పుష్ప-2’కు మొత్తంగా ఇండియా అంతటా హైప్ ఉంటుందనడంలో సందేహం లేదు. దాని తర్వాత బన్నీ చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లోనే ఉండబోతున్నాయి. మరి ముందే ఇలాంటి ఇమేజ్ సంపాదించిన బన్నీ.. జక్కన్నతో జట్టు కడితే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.