సీఎం జగన్ పాలనలో ప్రజాస్వామ్యం మంటగలిసి పోయిందన్న విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. పోలీసులను అడ్డుపెట్టుకొని విపక్ష నేతలు మొదలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన వారి వరకు అందరిపైనా ఉక్కుపాదం మోపడం పరిపాటి అయిందని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుండా…సస్పెన్షన్ వేటు వేస్తున్న అధికార పార్టీ నేతలు…అసెంబ్లీకి బయట కూడా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తెలిపేందుకు అనుమతివ్వకపోవడం చర్చనీయాంశమవుతోంది.
ఈ క్రమంలోనే తాజాగా విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. జంగారెడ్డిగూడెం నాటు సారా మరణాలకు సంబంధించి అబ్కారీ శాఖ కమిషనర్‌కు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీలో నాటు సారా మృతులపై మాట్లాడేందుకు అనుమతించకపోవడంతో ఆబ్కారీ కార్యాలయం దగ్గర ఆందోళన చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం..గత అర్ధరాత్రి నుంచే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును హౌస్ అరెస్ట్ చేయించింది. విజయవాడలో అచ్చెన్నను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అచ్చెన్నతోపాటు దేవినేని ఉమ, బోండా ఉమ, గద్దె రామ్మోహన్ వంటి నేతలనూ హౌస్ అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
రాష్ట్రంలో ప్రజా స్వామ్య పాలన లేదని, అరెస్టు చేసిన టీడీపీ నాయకులను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కల్తీ సారా మరణాలపై అసెంబ్లీలో చర్చకు టీడీపీ డిమాండ్ చేస్తున్న తమను సస్పెండ్ చేస్తున్నారని పైర్ అయ్యారు. జగన్ రెడ్డికి పోలీసులు తొత్తులుగా మారారని, గత అర్ధరాత్రి నుంచి తన ఇంటి చుట్టూ పోలీసులు పహారా కాస్తూ తనను హౌస్ అరెస్టు చేశారని మండిపడ్డారు. ప్రతిపక్షం ప్రజలలోకి వెళితే జగన్ రెడ్డికి ఉలుకెందుకని అచ్చెన్న ఫైర్ అయ్యారు.
కల్తీ సారా మరణాలపై ఏడో రోజు కూడా అసెంబ్లీలో టీడీపీ నిరసన తెలిపింది. ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు సభలో చిడతలు కొట్టి నిరసన తెలిపారు. అంతకుముందు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో పార్టీ శాసనసభా పక్ష నేతలు సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. జగన్ చిత్రపటాలకు సారాభిషేకం చేసి నిరసన తెలిపారు.