దక్షిణాది చిత్ర పరిశ్రమలో, అందులోనూ ప్రత్యేకించి తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలలో హీరోలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోలీవుడ్, టాలీవుడ్ లలో హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరుగుతుంటుంది. అందుకే టాలీవుడ్ లో మల్టీ స్టారర్ మూవీ చేయాలంటే స్టార్ హీరోలతో పాటు దర్శకనిర్మాతలకూ కత్తి మీద సామే. కానీ, ఆ ట్రెండ్ ను బ్రేక్ చేసి జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు ఆర్ఆర్ఆర్ వంటి భారీ మల్టీ స్టారర్ చిత్రంలో నటించారు.
ఫ్యాన్స్ మధ్యలో గొడవలు వస్తాయేమోనన్న ఆలోచనతో చాలాకాలంగా తారక్, చరణ్ లు తమ మధ్య ఉన్న స్నేహ బంధం గురించి చెబుతూనే ఉన్నారు. ఇటీవల చిక్ మంగళూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా కూడా తారక్, చెర్రీ అభిమానుల మధ్య జెండాల విషయంలో చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఆ నేపథ్యంలో ఫ్యాన్స్ అందరూ కలిసుండాలని తారక్ మెసేజ్ కూడా ఇచ్చాడు. అయినా, సరే తీరు మారని అభిమానులు తాజాగా మరో వివాదానికి తెర తీశారు.
తెలంగాణలోని కోదాడలో ఫ్లెక్సీలు, కటౌట్ల ఏర్పాటు విషయంలో తారక్, చరణ్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. దీంతో, కోదాడలోని ఓ థియేటర్ వద్ద తారక్ ఫ్లెక్సీలను ఆయన అభిమానులు కడుతుండగా చరణ్ అభిమానులు అడ్డుకున్నారని తెలుస్తోంది. దీంతో, ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైందని చెబుతున్నారు. తారక్, చరణ్ అభిమానుల మధ్య ఘర్షణతో థియేటర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఘర్షణ నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైన ఎన్టీఆర్ అభిమాని ఒకరు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది.
ఎన్టీఆర్ అభిమాని మైకు సైదులు రోడ్డుపై బైఠాయించి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే ఆ విషయాన్ని గమనించిన మిత్రులు వెంటనే అతడిని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన థియేటర్ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇద్దరు హీరోలకు చెందిన కొందరు అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.