టాలీవుడ్ విలక్షణ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. చెప్పదలుచుకున్న విషయాన్ని ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం, లాజికల్ గా విమర్శలు గుప్పించడం పోసాని నైజం. అయితే, రాజకీయాలపై మాట్లాడుతున్న సందర్భంలో కొన్నిసార్లు పోసాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కూడా అయ్యాయి. వైసీపీ, వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా ఉంటున్న పోసాని…జగన్ కు పలు మార్లు వకాల్తా పుచ్చుకున్నారు. జగన్ మంచి సీఎం అంటూ ఎన్నోసార్లు కితాబిచ్చారు.
అటువంటి పోసాని తాజాగా జగన్ పై చేసిన ఓ కామెంట్ హాట్ టాపిక్ గా మారింది. జగన్ ఓ బ్రహ్మపదార్ధం అంటూ పోసాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అయతే, జగన్ దూరం నుంచి చూసేవారికి బ్రహ్మ పదార్థంలా కనిపిస్తారని, దగ్గరి నుంచి చూసేవారికి దేవుడి ప్రసాదంలా కనిపిస్తారంటూ పోసాని తన స్వామిభక్తిని మరోసారి చాటుకున్నారు. కుటుంబ సమేతంగా ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన పోసాని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమా టికెట్లు గురించి అయినా, జగన్ గురించి అయినా తాను ఒకే ఒక్క మాట చెబుతానని, రెండో ప్రశ్నే అడగడానికి వీల్లేదని మీడియాకు పోసాని కండిషన్ పెట్టి మరీ మాట్లాడడం విశేషం. ప్రస్తుతం తాను ఐదారు సినిమాలతోపాటు, రెండు మూడు టీవీ షోస్తో బిజీగా ఉన్నానని, తాను హీరోగా చేసిన ఓ సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని చెప్పారు. తనక వెంకటేశ్వర స్వామి అంటే అమితమైన భక్తి అని, శ్రీవారి సన్నిధికి ఎన్నిసార్లు వచ్చానో లెక్కే లేదని చెప్పుకొచ్చారు.
తాను వైఎస్ కుటుంబ అభిమానిని అని, వైసీపీ గెలుపు తప్ప మరే పదవీ ఆశించలేదని గతంలో పోసాని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. మిగతావారిలాగా జగన్ అధికారంలోకి రాగానే ఎగబడి పదవులు తీసుకునే అలవాటు తనకు లేదంటూ పోసాని చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి. ఇక, ఇటీవల సినిమా టికెట్లపై చర్చ సందర్భంగా పోసాని…అర్ధాంతరంగా మీటింగ్ నుంచి వెళ్లిపోయారన్న టాక్ వచ్చింది.