దక్షిణాదిలో సినీ తారలకు అభిమానులు, అభిమాన సంఘాలు ఎక్కువ. అందులోనూ ప్రత్యేకించి తమిళనాట, తెలుగునాట అయితే కొందరు హీరోలను, హీరోయిన్లను ప్రేక్షకులు డెమీగాడ్ లుగా కొలుస్తంటారు. రజనీకాంత్, నమిత వంటి నటీనటులకు తమిళతంబీలు ఏకంగా గుళ్లూ గోపురాలు కట్టించిన చరిత్ర ఉంది. ఇక, తెలుగునాట అయితే తమ అభిమాన హీరో సినిమా విడుదలైనపుడు భారీ కటౌట్ లు, వాటికి క్షీరాభిషేకాలు కేక్ కట్టింగ్ లు, అన్నదానాలు థియేటర్లు వంటివి చేయడం కామన్.
ఇక, తమ ఫేవరెట్ హీరో ఫస్ట్ డే, ఫస్ట్ షోకి వచ్చిన ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. స్క్రీన్ ముందు ర్యాంప్ మీద డ్యాన్స్ లతో గోలగోల చేయడం…థియేటర్ల పైకప్పు ఎగిరిపోయేలా ఈలలు, కేకలు వేయడం….పేపర్లు చించి విసిరేయడం….చొక్కాలు విప్పేసి రచ్చరచ్చ చేయడం…వంటివి కామన్. ఇక, కొన్ని థియేటర్లలో అభిమానుల అత్యుత్సాహంతో చేసే రచ్చకు థియేటర్ల తెరలు చిరిగిపోవడం, కుర్చీలు విరిగిపోవడం కూడా జరుగుతుంటాయి.
ఇదంతా ఒక స్టార్ హీరో సినిమాకు అతడి అభిమానులు చేసే రచ్చ తాలూకు డ్యామేజి. ఇక, ఒకే స్క్రీన్ పై ఇద్దరు స్టార్ హీరోలు దర్శనమిస్తే? అది కూడా 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కి…నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న సినిమా అయితే? ఆ ఇద్దరు హీరోల అభిమానులు చేసే రచ్చను అంచనా అస్సలు వేయలేం. అందుకే, మార్చి 25న ‘ఆర్ఆర్ఆర్’ విడుదలనాడు ఆ రచ్చ జరుగుతుందేమో అన్న అనుమానంతో ఏపీలోని విజయవాడలో ఓ థియేటర్ యజమాని ముందుచూపుతో తీసుకున్న జాగ్రత్తలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
‘ఆర్ఆర్ఆర్’ విడుదల రోజు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంత రచ్చ చేస్తారోనని కొందరు థియేటర్లలో యజమానులు బెంబేలెత్తుతున్నారు. ఆ ఊహకే భయమేసిన కొందరు థియేటర్లు ఓనర్లు… అభిమానులకు షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఫ్యాన్స్ హంగామాకు తమ థియేటర్లలో తెరలు చిరగకుండా స్క్రీన్ వద్దకు ఫ్యాన్స్ ఎవ్వరు రాకుండా స్క్రీన్ ముందు ర్యాంప్ పై వందలాది మేకులను అమర్చారు. మరో థియేటర్లో అయితే స్క్రీన్ చుట్టూ ఫెన్సింగ్ వేశారు. విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్ మేకులు, ఫెన్సింగ్ తో స్క్రీన్ ను కాపాడుకుంటున్నారు ఓనర్లు.
ఈ వార్త తెలుసుకున్న తారక్, బన్నీ ఫ్యాన్స్…షాకయ్యారు. తెర ముందు తీన్ మార్ వేయకుండా ఆర్ఆర్ఆర్ సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడడం ఎలా అని తెగ మదనపడిపోతున్నారట. మరి, మార్చి 25 న అభిమానులు ఆ థియేటర్లలో సైలెంట్ గా సినిమా చూసి వస్తారా లేక మేకుల మీద డ్యాన్స్ చేసి మరీ తమ అభిమానాన్ని చాటుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.