సొంతపార్టీపై జనసేన వీరమహిళ ఒకరు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. పార్టీలో తనకు అన్యాయం జరిగిందని, తనకు పవన్ కల్యాణ్ వచ్చి న్యాయం చేసేవరకు పోరాటం ఆగదని చెబుతున్నారు. ఈ ప్రకారం మంగళగిరి జనసేన కార్యాలయం ఎదుర సునీత బోయ అనే వీర వనిత ధర్నాకు దిగారు. పార్టీ కార్యాలయంలోకి వెళ్లేందుకు కూడా తనను అనుమతించడం లేదని సునీత సంచలన ఆరోపణలు చేశారు. అందుకే, తాను రోడ్డుపైనే ఆందోళనకు దిగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సినీ నిర్మాత ఉదయ శ్రీనివాస్ అలియాస్ బన్సీ వాసు తనకు అన్యాయం చేశారని సునీత షాకింగ్ ఆరోపణలు చేశారు. తాను సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసుకుంటున్న సమయంలో తనకు బన్నీ వాసు పరిచయమయ్యారని సునీత చెప్పారు. 2019 ఎన్నికల సమయంలో గాజువాక, భీమవరంలో పవన్ తరపున ప్రచారం చేస్తే గీతా ఆర్ట్స్ సినిమాలో అవకాశం ఇప్పిస్తానని బన్నీవాసు తనకు వాగ్దానం చేశారని సునీత వెల్లడించారు.
అయితే, ఎన్నికలైన తర్వాత బన్నీ వాసు మొహం చాటేశారని, గీతా ఆర్ట్స్ సినిమాల్లో అవకాశాలిప్పిచ్చకుండా తనను మోసం చేశారని ఆమె ఆరోపించారు. అంతేకాదు, తనకు డ్రగ్స్ ఎక్కించి దాడికి కూడా పాల్పడ్డారని షాకింగ్ ఆరోపణలు చేశారు. పవన్ వచ్చి తనకు న్యాయం చేసే వరకు తన పోరాటం కొనసాగుతుందని సునీత తేల్చి చెప్పారు. మరి, ఈ వ్యవహారంపై పవన్ స్పందన ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.