హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పీఏ శేఖర్ పై గతంలో పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. హిందూపురం టీడీపీ క్యాడర్ కు శేఖర్ అందుబాటులో ఉండడం లేదని ఆరోపణలు వచ్చాయి. బాలకృష్ణ లేని సమయంలో టీడీపీ నేతలపై పెత్తనం చేయడమే కాకుండా పార్టీని గ్రూపులుగా విడగొట్టారని.. బాలయ్యపేరుతో అవినీతి చేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లే ఆనాడు తిరుగుబావుటా ఎగురవేశారు. కేడర్ తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆయనను బాలయ్య తీశేసారు.
ఆ తర్వాత తన పీఏగా బాలాజీని ఐదేళ్ల క్రితం బాలయ్య నియమించారు. హిందూపురంలో బాలయ్య పనులు, షెడ్యూల్ మొత్తం బాలాజీనే చూసుకుంటున్నారు. కానీ, బాలాజీతోనూ బాలయ్యకు చిక్కులు తప్పడం లేదు. తాజాగా పేకాట ఆడుతూ బాలాజీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అదికూడా, హిందూపురం వైసీీపీ నేతలతో కలిసి బాలాజీ పేకాడుతూ పట్టుబడ్డారన్న ప్రచారం బాలయ్యను ఇరకాటరంలో పడేశేలా కనిపిస్తోంది.
ఏపీ-కర్ణాటక సరిహద్దుల్లోని నగరిగేర ప్రాంతంలో ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్ పై కర్ణాటక పోలీసులు దాడులు నిర్వహించారు. అక్కడ పేకాడుతున్నారన్న పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు 19 మంది రాజకీయ ప్రముఖులు, ఉద్యోగులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ బాలాజీ, హిందూపురం వైసీపీ కన్వీనర్ శ్రీరామ్ రెడ్డిలతోపాటు పలువురు రాజకీయ నేతలున్నట్లు తెలుస్తోంది. అరెస్టయిన వారిని పోలీసులు చిక్కబళ్లాపూర్ లోని గుడిబండ కోర్టులో హాజరుపరిచారు.
ప్రత్యర్థి పార్టీ కీలకనేతలతో బాలాజీ కలిసి పేకాడడుతూ పట్టుబడటం హిందూపురంలో పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. టీడీపీ కేడర్ ను ఇబ్బందులు పెడుతున్న వైసీపీ నేతలతో బాలయ్య పీఏ పేకాడడం ఏమిటని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. బాలాజీ వ్యవహార శైలిపై కూడా కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే, వాటిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు బాలయ్య. ఈ తరుణంలో ప్రత్యర్థి పార్టీ నేతలతో పేకాడుతూ పట్టుబడడం చర్చనీయాంశమైంది. మరి, బాలాజీపై బాలయ్య వేటు వేస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. క్రమశిక్షణకు మారుపేరైన బాలయ్యకు దొరికే పీఏలంతా ఈ రకంగా క్రమశిక్షణ లేకుండా ఉండడం బాలయ్య, టీడీపీ అభిమానులను కలచి వేస్తోంది.