ఘనంగా ఆరంభించిన పార్టీ ఘన కీర్తిని అందుకోకుండానే ఉండిపోనుందా? ఆ విధంగా వైఎస్ ప్రాభవాన్ని కొనసాగించలేక తెలంగాణ వాకిట నుంచి నిష్క్రమించనుందా? ఇప్పుడయితే ఇవే సందేహాలు రాజకీయ వర్గాలను వేధిస్తున్నాయి.అదేవిధంగా వైఎస్సార్టీపీ మనుగడను కూడా ఇవే సందేహాలు శాసిస్తున్నాయి.ఎన్నో ప్రశ్నలను అస్త్రాల రూపంలో సంధిస్తూ బలమైన ప్రత్యర్థి కేసీఆర్ తో యుద్ధం చేయాలని తొలుత వైఎస్సార్టీపీ భావించింది.అదేవిధంగా కేసీఆర్ వర్గంతో తాడోపేడో తేల్చుకోవాలన్న ఆశతో, తలపడాలన్న తలంపుతో వైఎస్సార్టీపీ ఇవాళ తెలంగాణ కూడళ్లలో ఉంది.కానీ ప్రశ్నలే మిగిలి ఎటువంటి సమాధానం దక్కే అవకాశమే లేకుండా పోతోంది షర్మిలకు..
ఈ దశలో తెలంగాణ రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ ప్రకంపనలు బాగానే ఉన్నాయి.ఆయన అనుకున్న విధంగా కేసీఆర్ ఉన్నారు.. కానీ షర్మిల అనుకున్న విధంగా ప్రశాంత్ కిశోర్ లేరు. అదే విడ్డూరం.అవును! పీకే టీం నుంచి బయటకు వచ్చి కొత్త కుంపట్లు పెట్టుకున్న వారంతా కూడా కొత్త కొత్త స్ట్రాటజీలతో వెళ్తున్నారు.కానీ పీకే మాత్రం పాత సందేశాలనే జనంలోకి పంపుతూ హాయిగా నాలుగు డబ్బులు వెనకేసుకుంటున్నారు.పీకే ఎలా అయినా ఆలోచించనీ లేదా డబ్బులు సంపాదించనీ కానీ ఆయనను నమ్ముకున్న వారంతా పుట్టి మునుగుతున్నారు అన్నది ఓ వాదన.
సానుభూతి రాజకీయాల పేరిట ఆ రోజు వైసీపీకి ఎంతో సాయం చేసిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు తెలంగాణ వాకిట కేసీఆర్ కు స్ట్రాటజిస్ట్ గా ఉన్నారు.ఇక్కడ కూడా ఎంత కాలం ఉంటారో తెలియదు కానీ ఉన్నన్నాళ్లూ ఏవో ఒక ఉద్వేగ సంబంధ ప్రకటనలు మాత్రం కేసీఆర్ తో హాయిగా చేయిస్తుంటారు.అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేస్తుంటారు. ఇప్పుడిదే షర్మిలకు పెద్ద తలనొప్పిగా మారింది.ప్రశాంత్ కిశోర్ తమ పార్టీని వదిలేయడంతో దిక్కుతోచని స్థితిలో షర్మిల టీం ఉంది.త్వరలో తెలంగాణను వదిలి ఏపీ రాజకీయాలపై దృష్టి పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనకు కూడా ఆమె వచ్చారని తెలుస్తోంది.
ఈ దశలో పెద్దగా రాజకీయాలపై పట్టు లేని వారంతా ఇటుగా రాకపోవడమే మేలు అని స్ట్రాటజిస్టులను నమ్ముకుని పార్టీలను ప్రారంభించడం పెద్ద తప్పు అని షర్మిలను చూసి ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ విధంగా షర్మిల ఇప్పుడు పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్నారు.ఆమె అనుకున్న విధంగా తెలంగాణలో ఫలితాలు రావడం లేదు. అనుకున్న విధంగా పార్టీ నిలదొక్కుకోలేదు.అయినా కూడా పాదయాత్రను మాత్రం ఎందుకనో కొనసాగిస్తున్నారు.
ఆమె చేయాలనుకున్న నాలుగు వందల కిలోమీటర్ల మేర పాదయాత్రను కూడా కంప్లీట్ చేశాకే కొత్త తరహా రాజకీయం ఏంటన్నది తెలుస్తుంది అని కొందరు షర్మిల తరఫు వకాల్తా పుచ్చుకుంటున్నారు.కానీ ఆమె టీం నుంచి ప్రశాంత్ కిశోర్ తప్పుకున్నారు. ఇప్పుడీయన ఆ రోజు షర్మిలకు చెప్పిన ఫార్ములానే కేసీఆర్ కు అమ్ముకున్నారన్న విమర్శలూ ఆరోపణలూ కూడా వస్తున్నాయి.ఆ రోజు నిరుద్యోగులకు సంబంధించి ప్రతి మంగళవారం దీక్ష చేపట్టాలని సూచించి,తీరా అక్కడి నుంచి వచ్చేక కేసీఆర్ కు మరో కొత్త ప్లాన్ ఇచ్చి,నోటిఫికేషన్లపై అసెంబ్లీలో ప్రకటన చేయించి..మరో ఆలోచన చేయకుండానే వైఎస్సార్టీపీకి ఘోరమయిన దెబ్బకొట్టారన్నది షర్మిల సంబంధీకుల ఆవేదన.
దీంతో పార్టీ బలోపేతానికి ఏం చేస్తే బాగుంటుందో అన్న సంశయం ఇప్పుడు బాగా షర్మిలను వెన్నాడుతోంది.పీకే టీం నుంచి ఇంకెవ్వరిని అయినా ఇటుగా తీసుకువచ్చి పార్టీని నడిపితే ఎలా ఉంటుంది అన్న ప్రతిపాదన కూడా ఉంది అని తెలుస్తోంది.లేదంటే రాజశేఖర్ రెడ్డికి సాయం చేసిన కేవీపీలాంటి వారిని సీన్ లోకి తీసుకుని రావాలన్న ప్రతిపాదన కూడా ఉంది.ఇవేవీ ఫలితాలు ఇస్తాయో లేవో చెప్పలేం కానీ వైఎస్సార్టీపీని కొంత కాలం ప్రజల మధ్య ఉంచేందుకు ఉపయోగపడతాయి అని మాత్రం సందేహ రహితంగా చెప్పవచ్చు.