ఏపీలో ఇప్పుడో దరిద్రపు మాయరోగం మొదలైంది. ఆలయాలు.. దేవతామూర్తులు.. ఇలా పలువురు పవిత్రంగా కొలిచే వాటిని గుర్తు తెలీకుండా ధ్వంసం చేయటం.. ఉద్రిక్తతలు చోటు చేసుకోవటం అలవాటుగా మారింది. ఇది కాస్తా రాజకీయ రగడగా టర్న్ తీసుకుంటోంది. ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లోని గుళ్లు.. దేవతామూర్తుల ధ్వంసం చోటు చేసుకోవటం.. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దుర్మార్గం వెనుక ఎవరున్నారు? అన్న విషయం ఇప్పటికి తేలకపోవటం తెలిసిందే.దేవతామూర్తుల ధ్వంసం ఘటనలు పెరిగినప్పటికీ.. వీటిని ఎవరూ చేశారో ఇప్పటికి ఏపీ పోలీసులు గుర్తించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ముస్లింలు.. పలువురు హిందువులు సైతం విపరీతంగా నమ్మే దర్గాను ధ్వంసం చేసినవైనం బయటకు వచ్చింది. చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలం నాగరాయతిపాలెం గ్రామంలో జిలానీ బాబా దర్గా ఉంది. దీన్ని పవిత్రంగా కొలుస్తుంటారు. అయితే.. గుర్తు తెలియని వ్యక్తులు దర్గాకు నిప్పు అంటించి.. ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు.
ఈ దర్గాలో ప్రతి ఏడాది ఏప్రిల్ లో ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. ఇందులో అన్ని మతాల వారు పాల్గొంటారు. నిప్పు పెట్టిన ఉదంతంలో దర్గాలోని సామాగ్రి దగ్థమైనట్లుగా తెలుస్తోంది. దర్గాను నిర్వహించే మజౌమ్ఏడాది క్రితం మరణించటంతో అప్పటి నుంచి దీనికి సంబంధించిన ఆలనా పాలనా కొంతకాలంగా ఎవరికి పట్టటం లేదు. ఇలాంటివేళలోనే తాజా ఉదంతం చోటు చేసుకుంది. అయితే.. ఇదెవరో కావాలని చేసింది కాదు.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందన్న మాట వినిపిస్తోంది. సీసీ కెమేరాల పుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఇది పూర్తి అయితే.. అసలేం జరిగిందన్న విషయంపై క్లారిటీ వచ్చే వీలుంది.