జమ్ము కశ్మీర్లో కశ్మీరీ పండిట్లపై జరిగిన అకృత్యాల నేపథ్యంలో తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రంపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా మొదలయ్యాయి. తాజాగా ఈ చిత్రంపై జమ్మూ కశ్మీర్ రాజకీయాల్లో కీలక పార్టీగా కొనసాగుతున్న నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రంలో చూపెట్టినదంతా నిజం కాదని ఒమర్ అబ్దుల్లా షాకింగ్ కామెంట్లు చేశారు.
ఈ సినిమాలో చాలా అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించారని ఆయన తప్పుబట్టారు. 1990లో కశ్మీర్లో పండిట్లపై దాడులు జరిగిన సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం అధికారంలో ఉన్నట్లు, ఫరూక్ అబ్దుల్లా సీఎంగా ఉన్నట్లు చూపించడం పచ్చి అబద్ధమని మండిపడ్డారు. నిజానికి ఆ సమయంలో జమ్మూ కశ్మీర్ గవర్నర్ జగ్మోహన్ పాలనలో ఉందని, కేంద్రంలో బీజేపీ కూటమి అధికారంలో ఉండగా…వీపీ సింగ్ ప్రధానిగా ఉన్నారని వెల్లడించారు.
1990ల నాటి దాడుల్లో కశ్మీర్ పండిట్లు మరణించడం, కశ్మీర్ వదిలి వెళ్లడం తీవ్ర విచారకరమని, అందుకు తాము చాలా బాధపడుతున్నామని అన్నారు. అయితే, ఆ అల్లర్ల కారణంగా కశ్మీర్ పండిట్లతోపాటు మస్లింలు, సిక్కులు, ఇతర మతాల వారు కూడా ప్రాణాలు కోల్పోయారని, కశ్మీర్ వదిలి వెళ్లాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అలా వలస వెళ్లిన ముస్లింలతో పాటు చాలా మంది ఇంకా కశ్మీర్ కు తిరిగి రాలేదని అన్నారు. కశ్మీర్ పండిట్లు తిరిగి కశ్మీర్ కు తిరిగి రావాలని తాము కృషి చేస్తామని, ఇందుకోసం పోరాటం చేసేందుకు కూడా సిద్ధమని స్పష్టం చేశారు.
అయితే, ఇప్పటికే ఈ చిత్రంపై జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మోహబూబా ముఫ్తి, ఫరుఖ్ అబ్దుల్లాలు కూడా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై వారిద్దరూ కూడా అభ్యంతరాలను వ్యక్తం చేశారు.