కేవలం టీడీపీ అధినేత చంద్రబాబుపై కక్ష సాధించడంలో భాగంగానే ఆంధ్రుల రాజధాని అమరావతిపై సీఎం జగన్ విషం కక్కిన సంగతి తెలిసిందే. అయితే, కోర్టు మొట్టికాయలు వేయడం, అమరావతి రైతులు పట్టువదలని విక్రమార్కుల్లాగా పాదయాత్రలు, నిరసనలు తెలపడం వంటి పరిణామాలకు భయపడ్డ జగన్…ఎట్టకేలకు తలొగ్గడం తెలిసిందే. కొద్ది నెలల క్రితం ఏపీలో మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సీఎం జగన్ ఉపసంహరించుకోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
జగన్ నిర్ణయాన్ని టీడీపీ నేతలతోపాటు యావత్ ఆంధ్ర ప్రజలు స్వాగతించారు. ఎట్టకేలకు జగన్ తన తప్పు తెలుసుకున్నారని, ఇప్పటికైనా ఏపీకి అమరావతే రాజధాని అని ఒప్పుకున్నారని సంతోషపడ్డారు. అయితే, తాము 3 రాజధానులపై మరింత పటిష్టంగా కొత్త బిల్లులు రూపొందించి సభలో ప్రవేశపెడతామంటూ జగన్ పరోక్షంగా హింట్ ఇచ్చారు. కానీ, కొద్ది రోజుల క్రితం అమరావతే ఏపీకి రాజధాని అంటూ హైకోర్టు తుది తీర్పు ఇవ్వడంతో….ఇక మూడు రాజధానుల విషయంలో జగన్ చేసేదేమీ ఉండదని అంతా అనుకున్నారు.
ఈ సమయంలోనే మూడు రాజధానుల అంశంపై తాజాగా సంచలన ప్రకటన ఒకటి వెలువడడం చర్చనీయాంశమైంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నే ఏపీ మూడు రాజధానుల బిల్లును జగన్ ప్రవేశపెట్టబోతున్నారని సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం ప్రకటించారు. అంతేకాదు, దానికి డేట్ కూడా ఫిక్స్ అయిందని, ఈ నెల 21న మూడు రాజధానులపై శాసనసభలో చర్చించి బిల్లు ప్రవేశపెడతామని జగన్ తమకు చెప్పారని ఆయన వెల్లడించడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
మూడు రాజధానుల శిబిర నిర్వాహకులు, బహుజన పరిరక్షణ సమితి ఉద్యమ నాయకులు గుర్నాథం, బేతపూడి సాంబయ్య, ఆదాం తదితరులు బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ తో కలిసి నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ను కలిసిన సందర్భంగా జగన్ ఈ హామీని ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల బిల్లును శాసనసభలో మరోమారు ప్రవేశపెట్టాలని కోరుతూ వారంతా జగన్కు వినతిపత్రం అందించారు. అయితే, ఈ విషయంపై ప్రభుత్వం తరఫున ఎవరూ అధికారిక ప్రకటన చేయలేదు.