సీఎం జగన్ హయాంలో సినీ పరిశ్రమలోని కొందరిపై కక్ష సాధింపు ధోరణి మొదలైందన్న విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల తగ్గింపు మొదలు…20 శాతం షూటింగులు ఏపీలోనే జరుపుకోవాలని ప్రభుత్వం కోరడంపై పలువురు సినీ ప్రముఖులు విస్మయం వ్యక్తం చేశారు. కేవలం పవన్ ను టార్గెట్ చేయడం కోసమే…ఏపీలో జగన్ ప్రభుత్వం…టికెట్ల రేట్లు, థియేటర్లలలో వసతులు అంటూ గత ప్రభుత్వాలు వేలు పెట్టని విషయాల్లో లోతుగా వేళ్లు, ,కాళ్లు పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే వకీల్ సాబ్ సమయంలో జగన్ మొదలుబెట్టిన ఈ ట్రెండ్ ను భీమ్లా నాయక్ కూ కొనసాగించారని, రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ కు మినహాయింపు ఇచ్చారని సినీ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇక, తాజాగా విశాఖలోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లోని రూ.30 కోట్ల నిధులు దుర్వినయోగమయ్యాయని, ఈ కారణంతో ఆ సెంటర్ అధ్యక్షుడిగా ఉన్న ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావును తొలగించారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ పుకార్లపై కేఎస్ రామారావు స్పందించారు.
సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం ప్రపంచంలో ఎక్కడాలేదని, ఏపీలో మాత్రం ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని కేఎస్ రామారావు అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితి లేదని, ఇండస్ట్రీ వ్యవహారాల్లో ప్రభుత్వానిది అనవసరమైన జోక్యమని అన్నారు. ఇకపై ఏపీలో వచ్చే కలెక్షన్లను బట్టే సినిమా బడ్జెట్ ను నిర్ణయించుకుంటే మేలని, ఎక్కువ బడ్జెట్ పెట్టి నష్టపోవద్దని సినీ నిర్మాతలకు సూచించారు.
గత ఆరేళ్లుగా తానే ఆ సెంటర్ కు అధ్యక్షుడినని, ఇప్పుడూ తానే ఉన్నానని అన్నారు. రాజకీయాలకు అతీతంగా సెంటర్ ను నిర్వహిస్తున్నామని , కల్చరల్ సెంటర్ నిధుల దుర్వినియోగం వార్తలు అవాస్తవమని చెప్పారు. ఆ కల్చరల్ సెంటర్ లో 1,250 మంది సభ్యులు ఉన్నారని, విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడాలనేదే తన ఉద్దేశమని తెలిపారు. ఇటీవలే వైజాగ్లో ఓ సమావేశం ఏర్పాటు చేసి, అధ్యక్షుడిగా తననే ఉండమని ఏకగ్రీవంగా తీర్మానించారని తెలిపారు.