గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా రెండు చిత్రాల గురించి చర్చ జరుగుతోంది. అందులో ఒకటి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజైన భారీ బడ్జెట్ చిత్రం రాధే శ్యామ్ అయితే…రెండోది ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలై పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయిన ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం. ఇప్పటికే ఈ రెండు సినిమాల గురించి పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయలు వెల్లడించారు. అయితే, తాజాగా ఈ రెండు సినిమాలను పోలుస్తూ వివాదాస్పద, విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రభాస్ రెమ్యునరేషన్ ను పక్కన పెడితే… రాధేశ్యామ్ చిత్రం మొత్తం బడ్జెట్ లో ఐదో వంతు ఖర్చుతో ఆ సినిమా తీయవచ్చని రామూ షాకింగ్ కామెంట్లు చేశారు. కథలోని ఎమోషన్స్ ను విజువల్ ఫీస్ట్ చంపేస్తుందని, సినీ అభిమానులకు అది అవసరం లేదని అభిప్రాయపడ్డారు. విజువల్ ఎఫెక్ట్స్ కంటే కథలో ఉండే దమ్ము ముఖ్యమని, ఒక నటుడి ముందు సినిమా సాధించిన వసూళ్లను బట్టి తర్వతి సినిమాపై అంచనాలుంటాయని అన్నారు.
అన్ని ఎలిమెంట్స్ సమానంగా బ్యాలెన్స్ చేయడం వల్లే బాహుబలి అంత కలెక్ట్ చేసిందని వర్మ చెప్పారు. ప్రభాస్‌ని పెడితే కొంతవరకు కలెక్షన్ వస్తాయిని, కానీ మిగతాది ప్రేక్షకుడికి కథను ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నామన్న పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుందని విశ్లేషించారు. విడుదలయ్యే వరకు ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం గురించి ఎవరికీ తెలీదని, అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ చిత్రం రూ.100 కోట్లు వసూలు చేసే దిశగా వెళుతోందని రాధేశ్యామ్ ను ఆ చిత్రంతో పోలుస్తూ తన మార్క్ విశ్లేషణతో కామెంట్ చేశారు.
కచ్చితంగా బాలీవుడ్ లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుందని, ‘ది కశ్మీర్ ఫైల్స్’ కు ముందు, తర్వాత అన్న రీతిలో కొత్త దర్శకులు ఇటువంటి సినిమాలు మరిన్ని తీస్తారని రామూ అభిప్రాయపడ్డారు. ఎప్పుడూ థియేటర్లలో అడుగుపెట్టిన సాధువులు కూడా ఈ చిత్రాన్ని చూసేందుకు థియేటర్లకు వస్తున్నారంటే ఇది సినిమా కాదని…ఇదొక విప్లవమని వర్మ చేసిన కామెంట్లు, రాధేశ్యామ్ చిత్రంపై వర్మ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.